Congress Candidates List in Telangana Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం నెలకొన్న తరుణంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రలతో (Congress Bus Tour) ప్రచారహోరుకు పిలుపునిస్తూనే.. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తూ త్వరితగతిన పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 15న తొలి జాబితా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Congress Screening Committee Meeting :స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాకు.. శుక్రవారం కేంద్ర ఎన్నికల కమిటీ(Central Election Committee) ఆమోద ముద్ర వేయవచ్చని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ వివాదరహిత నియోజక వర్గాల జాబితా సిద్ధం చేసింది. ఈ జాబితా 60 నుంచి 65 నియోజక వర్గాల వరకు ఉండొచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై మురళీధరన్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ నాలుగు సార్లు సమావేశమైంది. ఇటీవల 8 గంటల పాటు సుధీర్ఘంగా చర్చించింది.
వందకు పైగా నియోజక వర్గాలల్లో స్క్రీనింగ్ కమిటీలో కసరత్తు పూర్తైనప్పటికీ.. మరికొన్ని మార్పులు చేర్పులు ఉండడంతో అలాంటి నియోజక వర్గాలను మొదటి జాబితాలో కాకుండా తరువాత ప్రకటిచనున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, బలమైన నాయకులు ఉన్న నియోజక వర్గాలు తొలి జాబితాలో(Constituencies First list) ఉంటాయని చెబుతున్నారు.