Madhuyaski on kavitha: లిక్కర్ స్కామ్‌లో తప్పుడు ఆరోపణలంటున్న కవిత రాజీనామా చేసి విచారణకు సహకరించాలని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ కోరారు. తెలంగాణ ఏర్పాటు సమయంలోనూ కేటీఆర్, కవితపై ఆరోపణలు వస్తే చర్యలు తీసుకుంటామన్నారని తెలిపారు. కేసీఆర్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కవితతో రాజీమానా చేయించాలని డిమాండ్ చేశారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
కవితకు నిజాయితీ ఉంటే భాజపా నేతలపై పరువునష్టం కేసు వేయాలి. కేసీఆర్ కుటుంబంపై కేంద్రం ఈడీ, సీబీఐ సంస్థలతో దర్యాప్తు జరిపించాలి. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే కవితతో రాజీమానా చేయించాలి. ఎమ్మెల్సీ కవిత మరోసారి ఉద్యమ ముసుగులో తప్పించుకోవాలని చూస్తున్నారు. కవిత ఎంపీగా ఉన్న సమయంలో విభజన హామీలపై పోరాటం చేశారా?
-మధుయాష్కీ, కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్
తెలంగాణ ముసుగులో కేటీఆర్, కవిత రాజకీయాల్లోకి వచ్చారని మధుయాష్కీ ఆరోపించారు. రాష్ట్రం వచ్చాక ద్రోహులను చేర్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేశారని విమర్శించారు. యువతను మత్తుకు బానిసలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. లిక్కర్ పేరుతో 8 ఏళ్లలో రూ.1.35 లక్షల కోట్లు ఆదాయం వస్తోందని.. దేశంలో అత్యధిక లిక్కర్ సేల్స్ తెలంగాణలోనే జరుగుతున్నాయని తెలిపారు.
కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే కవితతో రాజీనామా చేయించాలన్న మధుయాష్కీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు ఉందని భాజపా ఎంపీ ఆరోపించారని మధుయాష్కీ అన్నారు. గతంలో కవితతో కలిసి పనిచేసిన వ్యక్తి పరవేశ్ వర్మ అని తెలిపారు. కవితకు ఆస్తులు, భవనాలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవితను కేసీఆర్ వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి పేరుతో రూ.కోట్ల కొల్లగొట్టారని మధుయాష్కీ ఆరోపించారు. ఆప్ నేతలపై కూడా దర్యాప్తు సంస్థలతో విచారణ చేయాలని మధుయాష్కీ కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర భాజపా నాయకత్వం కవితపై దర్యాప్తునకు డిమాండ్ చేయాలన్నారు. దర్యాప్తు ఆలస్యం జరిగితే ఆధారాలు మాయం చేయడంలో కవిత దిట్ట అని మధుయాష్కీ వ్యాఖ్యానించారు. నిజామాబాద్‌లో ప్రేమసాగర్ అనే వ్యక్తి వెలమ అసోసియేషన్‌కు రూ.కోటి ఎక్కడి నుంచి ఇచ్చారని మధుయాష్కీ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత మరోసారి ఉద్యమ ముసుగులో తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కవిత ఎంపీగా ఉన్న సమయంలో విభజన హామీలపై పోరాటం చేశారా? అని మధుయాష్కీ నిలదీశారు.
ఇవీ చదవండి:బిడ్డను బద్నాం చేస్తే కేసీఆర్ తగ్గుతారని అనుకుంటున్నారు, తగ్గేదే లే అంటున్న కవిత
దిల్లీలో మళ్లీ రైతుల నిరసన, భారీగా ట్రాఫిక్ జాం