Congress Announced MLA Quota MLC Candidates :తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను హస్తం(Congress) అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ కార్యాలయం నుంచి ఇద్దరు అభ్యర్థులకు ఫోన్ కాల్ ద్వారా సమాచారం అందించినట్లు అభ్యర్థులు నిర్దారించారు. అయితే అధికారికంగా అభ్యర్థుల ఎంపిక ప్రకటనపై ఏఐసీసీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
తెలంగాణలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్సీలు పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరిలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. డిసెంబర్ 9వ తేదీన వీరిద్దరు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఆ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 11వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చింది. ఖాళీ ఏర్పడిన రెండు ఎమ్మెల్సీల్లో ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినది కాగా, మరొకటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినది కావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఆ దిశలోనే భర్తీకి కసరత్తు మొదలు పెట్టింది.
ఎమ్మెల్సీ ఉపఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేం : హైకోర్టు
ఈ రెండింటిని భర్తీ చేసేందుకు ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేసిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, పటేల్ రమేశ్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, మాజీ ఎంపీ బలరామ్ నాయక్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, ప్రొటోకాల్ ఛైర్మన్ హర్కర్ వేణుగోపాల్‌రావులు పోటీ పడ్డారు. అభ్యర్థుల ఎంపికలో పూర్తి స్థాయిలో చర్చించిన కాంగ్రెస్ అధిష్ఠానం, పార్టీ కోసం వారు చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుంది.