ఎమ్మెల్సీ ఎన్నికల బహిష్కరణకు కాంగ్రెస్ నిర్ణయం పార్టీ ఫిరాయింపులను నిరసిస్తూ... శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఓటింగ్‌లో ఎవరూ పాల్గొనవద్దని 19 మంది శాసనసభ్యులకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విప్ జారీ చేశారు. తమ పార్టీ శాసనసభ్యులను ప్రలోభాలకు గురిచేస్తూ... ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారని హస్తం నాయకులు మండిపడ్డారు. తెరాస ఒంటెద్దు పోకడలు, అప్రజాస్వామిక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చర్యలకు నిరసనగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టివిక్రమార్క వివరించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్న దుర్భుద్ది తెరాస నేతలకు మంచిది కాదని హితవు పలికారు. పార్టీ శాసనసభ్యులను రక్షించుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవుతుండటంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఆత్మరక్షణలో పడింది.