GHMC Council Meeting : జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా ముగిసింది. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే.. బీజేపీ కార్పొరేటర్లు హైదరాబాద్‌లోని సమస్యలపై చర్చించాలని పట్టుబట్టారు. కొందరు పోడియం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే విడుదల చేయాలని.. జీహెచ్‌ఎంసీలో చేసే పనులపై ఎమ్మెల్యేల పెత్తనం ఉండకూడదని డిమాండ్ చేశారు. పోడియం వద్దకు చేరి ప్లకార్డులను ప్రదర్శించారు. ఆందోళన జరుగుతున్న క్రమంలోనే.. రూ.6,224 కోట్ల బడ్జెట్‌కు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.
కార్పొరేటర్లు ప్రశ్నించాలంటే.. తమ స్థానాల్లోకి వెళ్లి ప్రశ్నించండి అని మేయర్ గద్వాల విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ భాజపా కార్పొరేటర్లు ఆందోళనలు కొనసాగించారు. దీంతో అసహనానికి గురైన మేయర్.. ఆందోళన విరమించకుంటే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అయినప్పటికీ భాజపా కార్పొరేటర్ల తీరు మారకపోవడంతో.. వారిని సస్పెండ్ చేసినట్లు మేయర్ ప్రకటించారు. ప్రజా సమస్యలపై భాజపా కార్పొరేటర్లకు పట్టింపు లేదని.. మేయర్ విజయలక్ష్మి ఆరోపించారు. సమస్యలపై ప్రశ్నించేందుకు సమయమిచ్చినా ఉపయోగించుకోకుండా.. నిరసనలు చేస్తున్నారని మండిపడ్డారు.
అంతకుముందు జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట.. కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. తాము ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాలకు.. బడ్జెట్ కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. బడ్జెట్‌పై సమగ్ర చర్చ జరపాలని నినాదాలు చేశారు. పోడియం వద్ద ఆందోళన చేపట్టిన బీజేపీ కార్పొరేటర్లను మేయర్ సస్పెండ్ చేయడంతో బయటకు వచ్చిన బీజేపీ కార్పొరేటర్లు.. లిబర్టీలోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని.. జీహెచ్‌ఎంసీలో ఎమ్మెల్యేల పెత్తనం ఏంటని.. బీజేపీ కార్పొరేటర్లు ప్రశ్నించారు.