Telangana Congress: రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ఈ నెల 30న కశ్మీర్‌లో ముగియనుంది. భారీ బహిరంగ సభతో ముగింపు కార్యక్రమం ఉండడంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్య నేతలంతా హాజరవ్వాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రంలో ఈ నెల 26నుంచి ప్రారంభం కావాల్సిన "హాథ్‌సే హాథ్ జోడో అభియాన్" కార్యక్రమం వచ్చే నెల 6వ తేదీకి వాయిదా పడింది. కానీ, ముందుగా నిర్ణయించిన తేదీ మేరకు రేపు రాష్ట్రంలోని అన్ని బ్లాకుల్లో "హాథ్‌సే హాథ్ జోడో అభియాన్" యాత్ర ప్రారంభం కానుంది.
అలాగే ఈ నెల 30న రాహుల్ పాదయాత్ర ముగింపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్లాకుల్లో జాతీయ జెండా ఎగుర వేసే కార్యక్రమం నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది. హాథ్‌సే హాథ్ జోడో అభియాన్ ద్వారా బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలను ఇంటింటికి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ కార్యాచరణతో సిద్ధమవుతోంది. అధిష్ఠానం పిలుపు మేరకు 'హాథ్‌సే హాథ్ జోడో అభియాన్' ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం కొనసాగనుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఛార్జిషీట్లు:దీనికి సంబంధించి 12మంది సభ్యులతో ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నేతృత్వంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఛార్జిషీట్లు వేసేందుకు కసరత్తు జరుగుతోంది. మరోవైపు పార్లమెంటు స్థానాల వారీగా వర్కింగ్ ప్రెసిడెంట్లను కేటాయించడంతో పాటు ఉపాధ్యక్షులను, సీనియర్ ఉపాధ్యక్షులను.. లోక్‌సభ నియోజకవర్గాలకు ఇంఛార్జిలుగా నియమించింది.
2 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఒక ప్రధాన కార్యదర్శి: వీరు కాకుండా ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రధాన కార్యదర్శులను ఇంఛార్జిలుగా నియమించేందుకు కసరత్తు జరుగుతోంది. 2 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఒక ప్రధాన కార్యదర్శిని నియమించాలని పీసీసీ భావిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుల డిమాండ్ల మేరకు రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శుల సంఖ్య ఇప్పుడున్న 84 నుంచి 100అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఒకే కుటుంబంలో ఇద్దరికి పదవులు ఇవ్వరాదన్న నిబంధన: అదేవిధంగా కార్యదర్శుల నియామకంపై దృష్టి సారించినప్పటికీ.. జోడో యాత్ర మొదలయ్యేనాటికి పూర్తయ్యే అవకాశాలు లేవు. మరోవైపు రాష్ట్రంలోని 26 జిల్లా అధ్యక్షులను నియమించిన ఏఐసీసీ.. 7 జిల్లాలకు సంబంధించి నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో పెండింగ్‌లో ఉంచింది. సికింద్రాబాద్, ఎల్బీనగర్, మెదక్ జిల్లాల డీసీసీల విషయంలో ఒకే కుటుంబంలో ఇద్దరికి పదవులు ఇవ్వరాదన్న నిబంధనతో ఆపారు.