రాష్ట్రంలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో గ్రూప్-1తో పాటు మొత్తం నాలుగు ఉద్యోగ పరీక్షలు కమిషన్ రద్దు చేసింది. ఈ క్రమంలో ఉద్యోగార్థులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ముఖ్యంగా గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించి.. మొయిన్స్‌కు సన్నద్ధమవుతున్న వారు.. ఆర్థిక భారాన్ని తలచుకుని ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మానసికంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరో మూడు నెలల్లో మెయిన్స్ పూర్తవుతుంది.. కచ్చితంగా ఉద్యోగం సాధిస్తామన్న విశ్వాసంతో చదువుతున్న వారి ఆశలు అడియాశలయ్యాయి. మళ్లీ ప్రిలిమ్స్ రాయాలా? ఒకవేళ పొరపాటున గట్టెక్క లేకుంటే ఎలా? ఈ మధ్యలో ఇంకెన్ని పరిణామాలు సంభవిస్తాయో? అనే ప్రశ్నలు వారిని వెంటాడుతున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లో ఉంటూ పరీక్షకు సన్నద్ధం కావాలంటే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉండి సిద్ధమవ్వాలంటే నెలకు అన్నీ కలిపి రూ.10,000 ఖర్చు తప్పదని వారు ఆందోళన చెందుతున్నారు. పరీక్షల రద్దుతో కనీసం మరో ఆరు నెలలు అదనంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ప్రిలిమ్స్ నెగ్గలేదని వెనక్కి వెళ్లిన వారు కూడా మళ్లీ పరీక్షకు సిద్ధమవుతారు. ఇలాంటి వారు చాలా మంది హైదరాబాద్‌కు చేరుకుంటారు. అంటే.. వారంతా మళ్లీ ఖర్చు పెట్టాల్సిందే. పరీక్షల రద్దుతో కోచింగ్ సెంటర్లకు, హాస్టళ్లు.. పుస్తకాల రచయితలు, వాటి పబ్లిషర్లు, వాటిని విక్రయించే వారికి మాత్రం లాభమేనని గాంధీనగర్‌లో ఉంటున్న పలువురు నిరుద్యోగులు వ్యాఖ్యానించారు.