CONFLICTS BETWEEN YSRCP MLAs : ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీలో విభేదాలు బయటపడ్డాయి. విజయవాడ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పుట్టినరోజు కార్యక్రమానికి వచ్చిన.. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య.. తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వెల్లంపల్లి.. తన నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడిని సీఎం వద్దకు ఎలా తీసుకెళ్తారంటూ పరుష పదజాలంతో ఉదయభానును నిలదీశారు.
వెల్లంపల్లి మాటలకు తొలుత మౌనంగా ఉండిపోయిన ఉదయభాను.. కాసేపటికే తీవ్ర ఆగ్రహం ప్రదర్శించారు. ‘పార్టీలో సీనియర్ లీడర్‌ను. నీలా పదవి కోసం మారలేదు. మూడు పార్టీలు మారిన ఊసరవెల్లివి నువ్వు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నువ్వు నాకు చెప్పేదేంటి...’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో వెల్లంపల్లి పైకి దూసుకెళ్లారు. బొప్పన భవకుమార్ అనుచరులు వెంటనే అక్కడికి చేరుకుని పుట్టినరోజు కార్యక్రమ వేదిక వద్ద ఈ వివాదాలు ఏమిటంటూ ఉదయభానును.. వెల్లంపల్లిని విడివిడిగా అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది.