Telangana Budget Sessions 2023-24: రాజ్‌భవన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మొదట వివాదంతో ప్రారంభమైన రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు సాఫీగా ముగిశాయి. ఈ నెల మూడో తేదీన గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన ఉభయ సభల సమావేశాలు.. నిన్నటితో ముగిశాయి. కేవలం 8 పని దినాల్లోనే ఎజెండా మొత్తాన్ని పూర్తి చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ప్రభుత్వ సమాధానం, 2023-24 బడ్జెట్, సాధారణ చర్చ, ద్రవ్య వినిమయ బిల్లు ప్రక్రియలు పూర్తయ్యాయి.
56.25 గంటలు సాగిన సమావేశాలు:గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు తొలిసారిగా ముఖ్యమంత్రి కాకుండా ఆయన తరఫున మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. రోజుకు 12, 13 చొప్పున మూడు రోజుల్లో 37 డిమాండ్లపై శాసనసభలో చర్చ పూర్తి చేశారు. ఇందుకోసం దాదాపు అర్ధరాత్రి వరకు సభను నడిపారు. అటు శాసన మండలి సమావేశాలు 5 రోజుల పాటు జరిగాయి. మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండ ప్రకాశ్ ఈ సమావేశాల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏడు రోజుల్లో అసెంబ్లీ 56 గంటల 25 నిమిషాల పాటు, ఐదు రోజుల్లో మండలి 15 గంటల పాటు సమావేశమయ్యాయి. రెండు సభల్లోనూ ఈ దఫా ఒక్క నిమిషం కూడా సమయం వృథా కాలేదని శాసనసభ సచివాలయం తెలిపింది.