CBI Inquiry on MP Avinash in Viveka murder case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరోసారి హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి వచ్చిన ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ ముగిసింది. దాదాపు 4.30 గంటలపాటు సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్‌ను ప్రశ్నించారు. ఏపీ సీఎం వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోంది. ఈ కేసులో అరెస్టయిన సునీల్ యాదవ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై దాఖలు చేసిన కౌంటర్‌లో సీబీఐ అనేక సంచలన విషయాలు ఇటీవలే వెల్లడించింది. ఇందులో అవినాష్‌రెడ్డి గురించి చాలాసార్లు ప్రస్తావించింది.
Viveka murder case updates : వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డి పాత్రను మొదటి నుంచీ అనుమానిస్తున్న సీబీఐ గత నెల 28నే మొదటిసారి విచారించింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 160 కింద ఇప్పుడు ఇంకోసారి నోటీసులు జారీ చేసి, తమ కార్యాలయానికి పిలిపించి అవినాష్ వాంగ్మూలం నమోదు చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు హాజరుకావాలని నోటీసులో ఉన్నప్పటికీ ఆయన 12.45కే హాజరవడం గమనార్హం. వివేకా హత్య జరిగిన రోజు నిందితుడు సునీల్ యాదవ్ ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నాడని, కదిరి నుంచి దస్తగిరి గొడ్డలి కొనుక్కొని వచ్చాడని, దాంతోనే వివేకను చంపారని సీబీఐ అభియోగం.
CBI investigation in Viveka Murder Case : ఈ విషయానికి సంబంధించి సీబీఐ అధికారులు అవినాష్‌రెడ్డిని కొన్ని ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. తాము దర్యాప్తు చేపట్టే నాటికే చాలావరకు ఆధారాలు మాయమయ్యయని సీబీఐ భావిస్తోంది. కేసు దర్యాప్తు కష్టంగా మారుతున్న నేపథ్యంలో సీబీఐ ప్రత్యామ్నాయంగా సాంకేతిక ఆధారాలపై దృష్టి పెట్టింది. ఉదాహరణకు అనుమానితులు, నిందితులు.. హత్య జరిగిన రోజు ఎక్కడెక్కడ తిరిగారో వారి మొబైల్లోని జీపీఎస్ లొకేషన్ల ఆధారంగా వివరాలు సేకరించింది. హత్య జరిగిన సమయంలో ఎవరెవరు ఎక్కడెక్కడున్నారు, ఎటు వైపు ప్రయాణించారు వంటి విషయాలకు సంబంధించి నివేదికను రూపొందించుకుంది. దీని ఆధారంగానే సీబీఐ అధికారులు అవినాష్‌ను పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన సునీల్ యాదవ్.. వివేకా హత్య జరిగిన రోజున అవినాష్ ఇంట్లో ఎందుకు ఉన్నాడని సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.
MP Avinash on CBI inquiry : సీబీఐ విచారణ అనంతరం కేంద్ర దర్యాప్తు సంస్థ ఆవరణ బయట మీడియాతో మాట్లాడిన ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు. వాస్తవాన్ని కాకుండా వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని విచారణ జరుగుతోందని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి అన్నారు. తనకు తెలిసిన నిజాలతో కూడిన విజ్ఞాపన పత్రం ఇచ్చానన్న అవినాష్... కూలంకషంగా విచారణ చేయాలని కోరానని స్పష్టం చేశారు. సీబీఐ విచారణ వాస్తవిక లక్ష్యంగా జరగడం లేదన్నారు. వ్యక్తి లక్ష్యంగా విచారణ జరుగుతుందనే సందేహం కలుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఏడాది క్రితం టీడీపీ చేసిన ఆరోపణలే సీబీఐ కౌంటర్‌లో లేవనెత్తడంతో సందేహం కలుగుతోందన్నారు. గూగుల్ టేక్‌అవుటా.. తెదేపా టేక్‌అవుటా.. అనేదాన్ని కాలమే నిర్ణయిస్తుందన్న అవినాష్‌రెడ్డి.. సీబీఐ అఫిడవిట్ అంశాలను టీడీపీ నేతలు ఏడాదిగా విమర్శిస్తున్నారన్నారు.