Concession for passengers in metro trains: హైదరాబాద్ నగర వాసులకు మెట్రో రైలు సంస్థ మరోసారి మెట్రో రాయితీల్లో కోత విధించనుంది. ఏప్రిల్ 1 నుంచి మెట్రో రాయితీల్లో కోత విధించనున్నట్లు అధికారులు తెలిపారు. రద్దీ వేళల్లో డిస్కౌంట్‌ను పూర్తిగా ఎత్తివేయనున్నట్లు మెట్రో అధికారులు పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకూ.. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ మాత్రమే రాయితీ వర్తిస్తుందని తెలిపారు.
అంతే కాకుండా సూపర్ సేవర్ హాలీడే కార్డ్ ఛార్జీని భారీగా పెంచనున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం సెలవు రోజుల్లో ప్రయాణించే హాలిడే కార్డు రూ.59గా ఉన్న ధరను రూ.99కి పెంచనున్నారు. గతంలో రూ.59లతో కార్డు తీసుకున్న వారు సూపర్ సేవర్ రూ.99 రీఛార్జ్ చేసుకోవచ్చని మెట్రో అధికారులు ప్రకటించారు. కానీ, కొత్తగా తీసుకునే వారు మాత్రం రూ.100 చెల్లించాలని పేర్కొన్నారు. అలాగే కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డుల ధరను భారీగా పెంచనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైళ్లలో సగటున ప్రతి రోజూ 4.4 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. వీరందరిపై పైన పేర్కొన్న ధరల ప్రభావం ఉండబోతున్నాయి.
KTR letter to Central Govt: మరోవైపు మెట్రో రైల్ రెండో దశ పనులకు కేంద్రం వివక్ష చూపుతోందని పేర్కొంటూ మంత్రి కేటీఆర్ ఇటీవల కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీకి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూల నగరాలకు మెట్రో రైల్ ప్రాజెక్టులు ఇస్తోందని ఆరోపించారు. రద్దీ తక్కువగా ఉన్న నగరాలకు మెట్రో రైల్ మంజూరు చేస్తుందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్కు మెట్రో విస్తరణ అర్హత లేదనడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని మంత్రి లేఖలో పేర్కొన్నారు.
దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరం హైదరాబాద్ అని పేర్కొన్న మంత్రి.. ఇక్కడ ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉందన్న వాదన అర్థరహితమవని ఎద్దేవా చేశారు. గాంధీనగర్, కొచ్చి, బెంగళూరు, చెన్నై నగరాలతోపాటు లక్నో, వారణాసి, కాన్పూర్, ఆగ్రా, ప్రయాగ్రాజ్, మీరట్ వంటి చిన్న పట్టణాలకు కూడా కేంద్రం మెట్రో ప్రాజెక్టులను కేటాయించిందని మంత్రి పేర్కొన్నారు.