హైదరాబాద్ ఫిలింనగర్‌లో భజరంగ్‌దళ్ నేతలు ఆందోళనకు దిగారు. రామానాయుడు స్టూడియో సమీపంలోని గుట్టపై ఉన్న హనుమాన్ విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ అక్కడ బైఠాయించారు. గుట్ట పైనుంచి తొలగించిన ఆంజనేయుడి విగ్రహాన్ని తిరిగి అక్కడే ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. భజరంగ్‌దళ్ కార్యకర్తలను అరెస్ట్ చేసి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లకు తరలించారు.
పోలీసుల తీరుపై భజరంగ్‌దళ్ నేతలు మండిపడ్డారు. మందిరాన్ని దర్శించుకోవడానికి వెళ్లిన తమను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని భజరంగ్‌దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ సుభాశ్‌చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మందిరాలను దర్శించుకోవద్దని ప్రభుత్వమేమైనా ఉత్తర్వులు జారీ చేసిందా చూపాలని డిమాండ్ చేశారు. గుట్టపై అనేక సంవత్సరాలుగా ఉన్న హనుమాన్ విగ్రహాన్ని తొలగించడం బాధాకరమన్న ఆయన.. ఇదివరకు హనుమాన్ విగ్రహం ఉన్నచోటే మందిరాన్ని నిర్మించాలన్నారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.