Rajampet Vs Rayachoti : ఏపీ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజనపై పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత కడప జిల్లా పరిధిలో ఉన్న రాయచోటిని అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా చేయడంపై రాజంపేటలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాజంపేట వైకాపా మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో సుమారు 3వేల మంది విద్యార్థులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘జిల్లా కేంద్రంగా రాయచోటి వద్దు.. రాజంపేట ముద్దు’ అంటూ రాజంపేట బస్టాండ్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు.
''విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. పార్టీలకు అతీతంగా.. విద్యార్థులతో కలిసి ఇక్కడికి వచ్చాం. మా భవిష్యత్తు, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. కచ్చితంగా రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, జడ్పీఛైర్మన్ కలిసి.. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేసేందుకు కృషి చేయాలని కోరుతున్నాం.''
-కాంగ్రెస్ నాయకుడు
''రాజంపేట ప్రజల భవిష్యత్తును ప్రభుత్వం నాశనం చేస్తుంది. జిల్లా కేంద్రంగా రాజంపేటను ఎంపిక చేయాల్సిందే. వెంటనే స్థానిక ఎమ్మెల్యే, జడ్పీఛైర్మన్ పదవులకు రాజీనామా చేసి.. నిరసనలో పాల్గొనాలి. రాజంపేటను జిల్లా కేంద్రంగా మార్చే వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి.''