ఊహించినట్లే కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో బీటెక్ సీట్లు హాట్ కేకుల్లా మారాయి. వాటికి చెందిన 17 బ్రాంచీల్లో ఏకంగా 98.49 శాతం సీట్లు నిండాయి. మొత్తం 41,506 సీట్లలో 40,878 భర్తీ కాగా, మిగిలినవి 628 మాత్రమే. కేవలం సీఎస్‌ఈలో 18,682 సీట్లుండగా, 16 మాత్రమే మిగిలాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ సంబంధిత బ్రాంచీల్లో 80.96 శాతం సీట్లు నిండగా... సివిల్, మెకానికల్ సంబంధిత బ్రాంచీల్లో కేవలం 36.75 శాతమే భర్తీ అయ్యాయి. ఎంసెట్ తొలి విడత సీట్లను మంగళవారం రాత్రి విద్యార్థులకు కేటాయించారు. మొత్తం మీద కన్వీనర్ కోటాలో 71,286 సీట్లుండగా 60,208 భర్తీ అయ్యాయి. 11,078 మిగిలిపోయాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 13వ తేదీలోపు ఫీజు చెల్లించి 17-21 తేదీల మధ్య ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు. ఫీజు చెల్లించిన తర్వాత సీటును రద్దు చేసుకోవాలనుకుంటే ఈ నెల 26వ తేదీలోపు అయితే 100 శాతం సొమ్ము వాపసు ఇస్తారు.
ముఖ్యాంశాలివీ...
* ఈడబ్ల్యూఎస్ కోటాలో 4943 సీట్లు భర్తీ అయ్యాయి. క్రీడా, ఎన్‌సీసీ కోటా కింద సీట్లను కేటాయించలేదు.