వ్యాపారులకు మాత్రమే చక్ర వడ్డీని మాఫీ చేసి రైతులకు చేయకపోవడమేంటని... తెలంగాణ రైతు సంఘం ప్రశ్నించింది. తక్షణమే కేంద్ర ఆర్థిక మంత్రి వ్యవసాయ రుణాలపై కూడా చక్రవడ్డీని మాఫీ చేయాలని డిమాండ్ చేసింది. రైతులు తీసుకున్న రుణాలపై చక్రవడ్డీని మాఫీ చేయడం లేదని శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించడం పట్ల ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పెసరగాయల జంగారెడ్డి, తీగల సాగర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
వ్యవసాయ రుణాలు పొందిన రైతులపై ప్రతి 6 మాసాలకు ఒకసారి జూన్ 30న, మార్చి 31న వడ్డీని లెక్కగట్టి అసలులో కలుపుతారని... ఆ వడ్డీకి తిరిగి 6 మాసాల తర్వాత మళ్లీ వడ్డీని లెక్కగడతారని వివరించారు. ఈ విధంగా మూడు సంవత్సరాలు బాకీ ఉన్న రైతుపై 6 మాసాలకు ఒకసారి 6 విడతలుగా వడ్డీని లెక్కగట్టి అసలులో జమ చేయడం వల్ల రుణ భారం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.