పౌరహక్కులు, ప్రజా సంఘాల నేతల ఇళ్లల్లో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు ముగిశాయి. న్యాయవాది రఘునాథ్, డప్పు రమేశ్, జాన్, మహిళా సంఘం కార్యకర్త శిల్ప ఇళ్లల్లో తెల్లవారుజాము వరకు సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు పలు పుస్తకాలు, డాక్యుమెంట్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు, పెన్ డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు.
హాజరుకావాలి...
సాయంత్రం 4 గంటల నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు సోదాలు నిర్వహించి వాళ్లను ప్రశ్నించారు. అనంతరం నలుగురికి ఎన్ఐఏ అధికారులు నోటీసులిచ్చారు. ఎన్ఐఏ కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. హైకోర్టులో కేసులున్నందను శనివారం వస్తానని న్యాయవాది రఘునాథ్ ఎన్ఐఏ అధికారులకు చెప్పగా వాళ్లు అందుకు అంగీకరించారు. డప్పు రమేశ్, జాన్, శిల్ప.. ఎన్ఐఏ కార్యాలయంలో హాజరు కానున్నారు.
తెలుగురాష్ట్రాల్లో 31 ప్రాంతాల్లో సోదాలు...
తెలుగు రాష్ట్రాల్లో 31 ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మెదక్‌తో పాటుగా విశాఖ, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, కర్నూలు, కృష్ణా, తూ.గో, కడపలో సోదాలు నిర్వహించినట్లు స్పష్టం చేసింది. సోదాల్లో 40 సెల్‌ఫోన్లు, 44 సిమ్ కార్డులు, 70 హార్డ్‌డిస్క్‌లు, మైక్రో ఎస్డీ కార్డులు, 19 పెన్ డ్రైవ్‌లు, ఆడియో రికార్డర్, రూ.10 లక్షలు, ఆయుధాలు, మావోయిస్టు సాహిత్యం, జెండాలు, ప్రెస్‌నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు పేర్కొన్నారు.