కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటి వరకు ఉన్న 4.97 లక్షల దరఖాస్తుల పరిశీలన రేపట్నుంచి ప్రారంభించి పది రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థకు సంబంధించిన అంశాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం హైదరాబాద్ బీఆర్కే భవన్లో సమావేశమైంది. గంగుల కమలాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.
కొత్త రేషన్ కార్డుల జారీ, డీలర్ల కమిషన్ పెంపు, రేషన్ డీలర్ల ఖాళీల భర్తీ, రేషన్ దుకాణాల పెంపు, ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో కుటుంబసభ్యుల పేర్లు చేర్చడం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రివర్గం ఆదేశాల మేరకు ఇప్పటి వరకు ఉన్న దరఖాస్తుల పరిశీలన వెంటనే పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.