తెలంగాణ

telangana

ETV Bharat / state

'సర్‌.. డబ్బులు లేవంటున్నా.. రూ.2 వేలు వసూలు చేశారు'

Complaint on government hospitals : ప్రభుత్వ ఆసుపత్రుల ప్రసూతి విభాగాల్లో వసూళ్లపై ఓ బాలింత వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్​రావుకు ఫిర్యాదు చేసింది. తన వద్ద డబ్బులు లేవన్నా వినకుండా.. రూ.2 వేలు వసూలు చేశారంటూ మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటివి జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

సర్‌.. డబ్బులు లేవంటున్నా.. రూ.2 వేలు వసూలు చేశారు
సర్‌.. డబ్బులు లేవంటున్నా.. రూ.2 వేలు వసూలు చేశారు

By

Published : Aug 6, 2022, 10:46 AM IST

Complaint on government hospitals : కాన్పునకు వచ్చిన మహిళ నుంచి రూ.2 వేలు వసూలు చేసిన ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం మరోసారి బయట పడింది. తన వద్ద ముక్కుపిండి మరీ డబ్బులు తీసుకున్నారని ఓ మహిళ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వద్ద వాపోయింది. పేట్లబుర్జు ప్రసూతి ఆసుపత్రిలో తల్లిపాల బ్యాంకును ప్రారంభించేందుకు శుక్రవారం మంత్రి హరీశ్‌రావు అక్కడికి చేరుకున్నారు. బాలింతలు, గర్భిణులను ఒకచోట సమావేశ పరిచి వారి ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా తన వద్ద డబ్బుల్లేవని వేడుకున్నా, ఆసుపత్రి సిబ్బంది రూ.2 వేలు బలవంతంగా వసూలు చేశారని పాతబస్తీకి చెందిన బాలింత తస్రీమాబేగం మంత్రి దృష్టికి తెచ్చింది. అత్యవసర ఖర్చుల కోసం తన తల్లి ఇచ్చిన డబ్బులనూ తీసుకున్నారని కన్నీమున్నీరైంది. మంత్రి ఆసుపత్రి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మాలతిని వివరణ కోరారు. ఇకపై ఇలాంటి సంఘటనలు జరిగితే ఎవరైనా ఉపేక్షించొద్దని, అలాంటి వారిని ఇంటికి పంపడమే కాకుండా పోలీసు కేసూ పెట్టాలని ఆదేశించారు. శానిటేషన్‌, ఇతర ఖర్చులకు పడకకు రూ.700 కేటాయిస్తున్నా రోగుల నుంచి వసూలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. సిబ్బంది చేతివాటం వల్ల ఆసుపత్రికే చెడ్డ పేరు వస్తోందని, మానుకోవాలని హితవు పలికారు.

చాదర్‌ఘాట్‌కు చెందిన మరో గర్భిణీ ఒకే మంచాన్ని ఇద్దరికి కేటాయిస్తున్నారని చెప్పడంతో, సరిపడా పడకలు కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అంతకుముందు వార్డులు, ల్యాబ్‌ల వద్ద నిరీక్షిస్తున్న గర్భిణులు, రోగులతో హరీశ్‌రావు మాట్లాడారు. గర్భిణులకు సత్వరం పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించారు.
వసూళ్లపై ఆది నుంచి ఆరోపణలు..

ప్రభుత్వ ఆసుపత్రుల ప్రసూతి విభాగాల్లో బాలింతల నుంచి వసూళ్లకు సంబంధించి గతం నుంచి ఆరోపణలు ఉన్నాయి. గాంధీ, నిలోఫర్‌, పేట్లబుర్జు, సుల్తాన్‌బజార్‌ దవాఖానాల్లో ఆడపిల్ల పుడితే ఒక మొత్తం.. మగ శిశువుకైతే మరో మొత్తం వసూలు చేస్తున్నారు. గతంలో కోర్టు అక్షింతలు వేసినా.. తీరు మారడం లేదు.

ABOUT THE AUTHOR

...view details