జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా, మజ్లిస్‌కు మధ్యే పోటీ ఉంటుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. మజ్లిస్‌తో దోస్తీ చేస్తున్న ముఖ్యమంత్రి.. ముస్లింలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. భాజపాపై యుద్ధం ప్రకటించాలంటే.. ముందు ఫాంహౌస్ నుంచి కేసీఆర్ బయటకురావాలి కదా అని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీలో తెరాసకు మెజార్టీ రాకుండే.. మజ్లిస్ చేతిలో గ్రేటర్ పీఠం పెడతారని.. వారు వస్తే బ్రాండ్ హైదరాబాద్ కాస్తా.. ఆదాబ్ హైదరాబాద్ చేస్తారని విమర్శించారు.
హైదరాబాద్‌లో వరద సాయం పంపిణీని తామేందుకు అడ్డుకుంటామని అర్వింద్ ప్రశ్నించారు. సాయం పంపిణీ చేయాల్సి వస్తుందనే.. కేసీఆర్ ఎన్నికల కోడ్ తీసుకొచ్చారని ఆరోపించారు.
ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో తెరాస కనుసన్నల్లో నడుస్తోందని అర్వింద్ ఆరోపించారు. కొంతమంది అధికారులపైన ఫిర్యాదు చేస్తామన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్లను బదిలీ చేయమని లేఖ రాస్తామన్నారు. ఎన్నికల్లో భాజపాను అణిచివేయాలని చూస్తే ప్రత్యేక అధికారిని తీసుకొస్తామని వెల్లడించారు.