అవసరమైన పరీక్షలు నిర్వహించకుండానే చికిత్స అందించడం వల్ల భార్య మృతి చెందగా డాక్టర్ల నిర్లక్ష్యంపై పరిహారం అందడానికి 20 ఏళ్ల న్యాయ పోరాటం అవసరమైంది. అయినప్పటికీ పరిహారం తీసుకోకుండానే ఆ భర్త మృతి చెందగా పిల్లలకు ఇటీవల అపోలో ఆస్పత్రి రూ.20 లక్షల పరిహారం అందజేసింది. సికింద్రాబాద్ బోయినపల్లికి చెందిన పద్మావతి కడుపు నొప్పితో బాధపడుతుండగా ఆమె భర్త కె.ఎస్.శాస్త్రి 2000 అక్టోబరు 10న అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లి డాక్టర్ ఎం.గురునాథ్‌ను సంప్రదించారు. అవసరమైన పరీక్షలు చేయకుండానే నిర్లక్ష్యంగా ఈఆర్‌సీపీని నిర్వహించారని శాస్త్రి ఆరోపించారు. నవంబరు 11న ఆపరేషన్ నిర్వహించగా తర్వాత పలు సమస్యలు తలెత్తి పద్మావతి 24న మృతి చెందారు.
నిర్లక్ష్యమే కారణం...
ఉమ్మడి రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో ఆస్పత్రితోపాటు సంబంధిత డాక్టర్లందరిపై 2001లో కె.ఎస్.శాస్త్రి ఫిర్యాదు చేశారు. ఆధారాలను పరిశీలించిన రాష్ట్ర కమిషన్ డాక్టర్ గురునాథ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఆయన నిర్లక్ష్యానికి ఆస్పత్రి బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. మానసిక వేదనకు గురిచేసినందున ఫిర్యాదుదారుకు రూ.4 లక్షలను 9 శాతం వడ్డీతో ఆస్పత్రి, డాక్టర్ గురునాథ్‌లు చెల్లించాలని 2007 నవంబరులో తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ అపోలో ఆస్పత్రి ఎండీ సంగీతారెడ్డి, డాక్టర్ జె.ఎం.గురునాథ్‌లు జాతీయ వినియోగదారుల కమిషన్‌లో అప్పీలు దాఖలు చేశారు.