తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్‌ నుంచి కోలుకున్నా.. వేధిస్తున్న సాధారణ సమస్యలు - కరోనా వైరస్​ సైడ్​ ఎఫెక్ట్​లు లేటెస్ట్​ వార్తలు

ఓ ప్రైవేటు సంస్థలో ఉన్నతస్థాయి ఉద్యోగి(55) కొవిడ్‌ బారినపడి ఆసుపత్రిలో చేరారు. ఛాతీలో ఇన్‌ఫెక్షన్‌ రావడం వల్ల ఐసీయూలో ఉంచి ఆక్సిజన్‌ అందించాల్సి వచ్చింది. రెండు వారాల చికిత్స అనంతరం కోలుకొని ఇంటికెళ్లారు. వారం రోజుల తర్వాత మళ్లీ జ్వరం, ఆయాసం రావడంతో ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ (నిమోనియా) వచ్చినట్లుగా వైద్యులు నిర్ధారించి ఐసీయూలో చికిత్స అందించారు.

health problems after curing form corona virus
కొవిడ్‌ నుంచి కోలుకున్నా.. వేధిస్తున్న సాధారణ సమస్యలు

By

Published : Oct 5, 2020, 7:06 AM IST

కరోనా కోరల్లోంచి బయటపడినా.. కొన్నిసార్లు అది బాధితుల శరీరంలో సృష్టించిన అలజడుల ఛాయలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కువ కాలం ఆక్సిజన్‌ అవసరమైనవారిలో కొందర్ని శ్వాసకోశ సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఊపిరితిత్తుల్లో గట్టిదనం (ఫైబ్రోసిస్‌) ఏర్పడుతుండగా.. ఏదో ఒక సమస్యతో మళ్లీ ఆసుపత్రికి రావాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. లక్షణాలు తీవ్రమైతే ఆలస్యం చేయకుండా అత్యవసర చికిత్స పొందాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

5 నుంచి 10 శాతం మందికే ఇబ్బంది

సాధారణంగా ఊపిరితిత్తులు స్పాంజ్‌ మాదిరిగా పనిచేస్తుంటాయి. అయితే, వైరస్‌ దుష్ప్రభావం కారణంగా అవి గట్టిపడతాయి. దీన్నే వైద్యపరిభాషలో ‘ఫైబ్రోసిస్‌’ అంటారు. ఫలితంగా ప్రాంతం గట్టిపడి, శ్వాసకోశాల సంకోచ, వ్యాకోచాలు తగ్గిపోతాయి. రక్తంలోకి ఆక్సిజన్‌ను పంపించే ప్రక్రియ మందగిస్తుంది. ఫలితంగా రక్తంలో ప్రాణవాయువు తగ్గిపోయి ఆయాసం వస్తుంది. ఈ సమస్యకు తగిన మందులు వాడడం ద్వారా ఎక్కువమందికి ప్రమాదకరంగా మారదు.

ఆలస్యంగా చికిత్స పొందినవారిలో..

కరోనా బారినపడ్డ తర్వాత ఆలస్యంగా చికిత్స పొందేవారు.. కోలుకున్న తర్వాత మరోసారి ఆసుపత్రికి రావాల్సిన అవసరం ఏర్పడుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చికిత్సలో జాప్యం వల్ల తొలివారంలో వైరస్‌ తీవ్రత పెరుగుతుంది. ఆ ప్రభావంతో రెండోవారంలో సైటోకైన్స్‌ ఉప్పెనలా దాడి చేస్తాయి. ఫలితంగా శ్వాసకోశాలు, గుండెపై దుష్ప్రభావం పడుతుంది.

ఇన్‌ఫెక్షన్ల ముప్పు

స్టెరాయిడ్స్‌ ఇవ్వడంతో కోలుకున్న తర్వాత కొందరిలో రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. ఫలితంగా బ్యాక్టీరియా, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల బారినపడుతుంటారు. కొంతమందిలో రెండోసారి నిమోనియా కూడా వస్తోందని నిపుణులు చెబుతున్నారు. వయసు పైబడినవారికి గుండె వైఫల్య సమస్య కూడా ఎదురవుతుంది. వైద్యుల సూచనల మేరకు ఔషధాలు వాడాలి.

కోలుకున్న తర్వాత ఎదురయ్యే సమస్యలు

  • తలనొప్పి
  • ఒళ్లునొప్పులు
  • నీరసం
  • దగ్గు
  • ఆకలి లేకపోవడం
  • 99-99.5 డిగ్రీల జ్వరం వచ్చి పోతూ ఉండటం
  • ఈ సమస్యలన్నీ క్రమేణా మందులతో తగ్గుతాయి.

కొందరిలో తీవ్రం

  • రక్తంలో చక్కెర స్థాయి పెరగడం
  • తీవ్ర ఆయాసం
  • గుండె దడ
  • ఛాతిలో పట్టేసినట్లుగా ఉండడం
  • గుండె, ఊపిరితిత్తుల్లో సమస్యలు

ఎప్పుడు ప్రమాదమని గుర్తించాలి?

  • కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాతా.. నడిచినప్పుడు ఆయాసంగా ఉండడం
  • చేతులు నీలిరంగులోకి మారడం
  • జ్వరం మళ్లీ మళ్లీ వస్తుండడం
  • దగ్గు నిరంతరంగా కొనసాగడం, క్రమేణా పెరుగుతుండడం
  • రక్తంలో ఆక్సిజన్‌ శాతం 90-94 కంటే తగ్గడం
  • ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రిలో చికిత్స పొందాలి.

కొవిడ్‌ బాధితులకు మొదటి వారంలో స్టెరాయిడ్స్‌ ఇవ్వకూడదు. అలా ఇస్తే.. వైరస్‌ నాశనం కాకుండా నిద్రాణంగా శరీరంలోనే ఉండిపోతుంది. అలాంటి కేసుల్లో కొందరు 3, 4 వారాల్లో మళ్లీ వైరస్‌ లక్షణాలతో ఆసుపత్రికి వస్తున్నారు. అనవసరంగా స్టెరాయిడ్స్‌ ఇస్తే మూత్రనాళంలో, రక్తంలో ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలున్నాయి. సైటోకైన్స్‌ ఉప్పెన ప్రభావం కొందరిలో రెండోవారంలో కనిపిస్తే.. మరికొందరిలో మూడు, నాలుగో వారంలోనూ వస్తోంది. ఇటువంటి వారూ ఆసుపత్రిలో చేరాల్సి వస్తోంది. వీరిలో రక్తం గడ్డకట్టే అవకాశాలెక్కువ కాబట్టి.. అత్యవసరంగా ఔషధాలను ఇవ్వాల్సి ఉంటుంది. కోలుకొని ఇంటికెళ్లాక కూడా క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ సేవలు, తగినన్ని నీళ్లు తాగడం, వైద్యులు సూచించిన ఔషధాలను క్రమం తప్పకుండా వాడడం, మానసికంగా ధైర్యంగా ఉండడం చాలా ముఖ్యం.

- డాక్టర్‌ విశ్వనాథ్‌ గెల్ల, పల్మనాలజిస్టు

కొవిడ్‌ చికిత్సలో భాగంగా రెండో వారంలో కొందరికి స్టెరాయిడ్‌ మందులు ఇవ్వాల్సి వస్తోంది. వీరిలో తిరిగి రోగ నిరోధక శక్తి పూర్వ స్థాయికి రావడానికి సమయం పడుతుంది. ఫలితంగా ఆకలి లేకపోవడం, నీరసంగా అనిపించడం వంటివి ఉంటాయి. ఇంటికెళ్లాక కూడా ఎప్పటికప్పుడు ఆరోగ్య సూచీలను సరిచూసుకోవాలి. షుగర్‌ పరీక్షలను ఇంట్లోనే చేసుకోవాలి. పల్స్‌ఆక్సీమీటర్‌తో రోజూ సరిచూసుకోవాలి. ఆకలి పెరగడానికి సూప్‌ల వంటివి తీసుకోవాలి. ఉడకబెట్టిన, వేడి ఆహారం, ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ఉప్పు తగ్గించాలి.

-డాక్టర్‌ పవన్‌రెడ్డి తూడి, జనరల్‌ ఫిజీషియన్‌

ఇదీ చదవండిఃనేడు ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి కానున్న ట్రంప్​!

ABOUT THE AUTHOR

...view details