దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ మొదటి రోజు విచారణ ముగిసింది. ప్రభుత్వం తరఫున హోం శాఖ కార్యదర్శి రవిగుప్త విచారణకు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన విచారణలో త్రిసభ్య కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సిర్పూర్కర్, సభ్యులు జస్టిస్ రేఖ, కార్తికేయన్లు రవిగుప్తను పలు ప్రశ్నలు అడిగారు. సిట్‌తో పాటు ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్లలోని వివరాలను హోంశాఖ కార్యదర్శి రవిగుప్త వివరించారు.
ఎన్కౌంటర్ జరిగిన సమయంలో నిందితుల కాల్పుల్లో గాయపడ్డ ఇద్దరు పోలీసులకు ఏ స్థాయిలో గాయాలయ్యాయని రవిగుప్తను కమిషన్ ప్రశ్నించింది. తీవ్ర గాయాలయ్యాయని రవిగుప్త చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందని కమిషన్.. శరీరంలో ఎక్కడెక్కడ గాయాలయ్యాయనే పూర్తి సమాచారం చెప్పాలని ఆదేశించింది.
ఎన్కౌంటర్ చేసిన సమయంలో పోలీసుల వద్ద ఉన్న ఆయుధాల గురించి కూడా కమిషన్ ప్రశ్నించింది. అఫిడవిట్లు దాఖలు చేసిన నలుగురు లాయర్లూ ఎన్‌కౌంటర్‌పై తమకున్న సందేహాలను కమిషన్ ముందుంచారు. దీనికి రవిగుప్త సమాధానం ఇచ్చారు. దిశ సోదరి సైతం అఫిడవిట్ దాఖలు చేయడంతో ఆమె కూడా కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లోనూ సిర్పూర్కర్ కమిషన్ మరోసారి విచారణ నిర్వహించనుంది. 18 మంది సాక్ష్యులను కమిషన్ విచారించనుంది.
సుప్రీం ఆదేశాలు
దిశ త్రిసభ్య కమిషన్ ఇప్పటి వరకు ప్రజల నుంచి 1,333 అఫిడవిట్లు, పోలీసులు, ప్రభుత్వం, సాక్షులు, వైద్యుల నుంచి 103 అఫిడవిట్లు స్వీకరించింది. కమిషన్ ఇప్పటి వరకు 16 సార్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పోలీసులు సమర్పించిన 24 అఫిడవిట్లలో కొన్నింటికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసింది. దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌పై మృతుల తల్లిదండ్రులతో పాటు, మానవ హక్కుల సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో త్రిసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ 2019 డిసెంబర్‌లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.