ఈ వానాకాలంలో సాగుచేసే పంటలకు కేంద్రం కొత్త మద్దతు ధరలను త్వరలో ప్రకటించనుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు తీసుకుని జాతీయ వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్ (సీఏసీపీ) కేంద్రానికి సిఫార్సులు చేసింది. పత్తి పంటకు ఈ ఏడాది అదనంగా మరో రూ.275 వరకు మద్దతు ధర పెంచాలని కోరింది.
పత్తికి అదనంగా రూ.275 పెంచండి!
పత్తి పంటకు ఈ ఏడాది అదనంగా మరో రూ.275 వరకు మద్దతు ధర పెంచాలని ‘జాతీయ వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్’(సీఏసీపీ) తాజాగా కేంద్రానికి సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఈ పంట మద్దతు ధర క్వింటాకు రూ.5,550 కాగా ఈ వానాకాలం నుంచి సాగుచేసే పంటకు రూ.5,825కి పెంచి ఇవ్వాలని కోరింది.
పత్తిలో పొట్టి గింజ, పొడవు గింజ రెండు రకాలుంటాయి. వీటికి వేర్వేరుగా ధరలు ప్రకటిస్తారు. పొట్టి గింజ పత్తి ధరను రూ.5,255 నుంచి రూ.5,515కి, పొడవు గింజ పత్తికి రూ.5,550 నుంచి 5,825కి పెంచాలని సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో పొడవు గింజ పత్తినే రైతులు సాగు చేస్తారు. దీనికే మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉంది. ఏటా 24 రకాల పంటలకు కేంద్రం మద్దతు ధరలు ప్రకటిస్తుంది.
ఇందులో వానాకాలం(ఖరీఫ్)లో వరి, మొక్కజొన్న, సజ్జ, జొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలున్నాయి. పప్పు ధాన్యాల్లో దేశవ్యాప్తంగా మినుము పంట సాగు బాగా పెంచాలని సీఏసీపీ సిఫార్సు చేసింది. ఈ పంటకు అత్యధికంగా క్వింటాకు అదనంగా మరో రూ.300 పెంచాలని కోరింది. సాధారణంగా సీఏసీపీ సిఫార్సులను కేంద్రం మార్పులు లేకుండా ఆమోదించడం ఆనవాయితీ. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా ఒత్తిడి తెస్తే ఏదైనా పంట ధరను పెంచుతుంది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం అనంతరమే కేంద్ర వ్యవసాయశాఖ కొత్త మద్దతు ధరలను అధికారికంగా ప్రకటిస్తుంది.