TSPSC OTR: టీఎస్పీఎస్సీ వద్ద వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) కింద నమోదైన అభ్యర్థుల వ్యక్తిగత వివరాల సవరణకు కమిషన్ అనుమతిచ్చింది. కొత్త అభ్యర్థులు కూడా నూతన ఓటీఆర్ కింద వివరాలు నమోదు చేసుకునేందుకు వీలు కల్పించింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సవరణ ఓటీఆర్ ఫారం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే నమోదైన అభ్యర్థులు ఎడిట్ ఓటీఆర్ ద్వారా, కొత్త అభ్యర్థులు తాజా రిజిస్ట్రేషన్ కింద వివరాలు నమోదు చేయాలని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కమిషన్ వెబ్‌సైట్లో అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం పూర్వ పది జిల్లాలు 33గా మారాయి. రెండు జోన్లు ఏడుగా, ఒక మల్టీజోన్ రెండు అయ్యాయి. అభ్యర్థుల స్థానికత ఈ ఉత్తర్వుల ప్రకారమే నిర్ణయమవుతుంది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వద్ద ఓటీఆర్ కింద నమోదైన 25 లక్షల మంది అభ్యర్థుల స్థానికతలోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి. అభ్యర్థులు తమ స్థానికత వివరాలను సవరించుకోవాల్సి ఉంటుంది. టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ, 1-7వ తరగతి వరకు వివరాలు ప్రస్తుత 33 జిల్లాలకు అనుగుణంగా నమోదు చేయాలి. వీటితో పాటు తాజా విద్యార్హతలూ పేర్కొనవచ్చు.
రిజిస్ట్రేషన్లు ఇలా...
* టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ‘న్యూ రిజిస్ట్రేషన్’పై క్లిక్ చేయాలి. మొబైల్ నంబరు పేర్కొనాలి. ఈ నంబరుకు ఓటీపీ వస్తుంది. దీన్ని నమోదు చేయాలి.
* దరఖాస్తు ఫారంలో వ్యక్తిగత సమాచారం, చిరునామా, ఈ-మెయిల్ ఐడీ, 1-7వ తరగతి వరకు 33 జిల్లాల ప్రాతిపదికన వివరాలు, విద్యార్హతలు ఇవ్వాలి.
* అభ్యర్థి ఫొటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. ఈ వివరాలన్నీ సబ్మిట్ చేసిన తరవాత టీఎస్‌పీఎస్సీ ఐడీ వస్తుంది. దీంతో పాటు జనరేట్ అయ్యే పీడీఎఫ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* ఒకవేళ సబ్మిట్ కన్నా ముందుగానే ‘లాగ్‌అవుట్’ అయితే మళ్లీ మొదటి నుంచి చేయాలి.