Commercial Taxes Department Focus on Assembly Elections : రాష్ట్రంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. పెద్ద ఎత్తున వివిధ వస్తువులు పంపిణీ జరుగుతుండడాన్ని నిలువరించాలని వాణిజ్య పన్నుల శాఖను ఆదేశించింది. దీంతో అప్రమత్తమైన ఆ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, కమిషనర్ క్రిష్టినా చొంగ్తుల నేతృత్వంలో ప్రతి రోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 14 వాణిజ్య పన్నుల డివిజన్ కార్యాలయాల పరిధిలో ఒక్కో డివిజన్‌కు నాలుగు చొప్పున 56 బృందాలతో పాటు.. మరో 50 ప్రత్యేక బృందాలు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మొత్తం 106 ప్రత్యేక బృందాలకు సీటీవో, డీసీటీవో స్థాయి అధికారులు నేతృత్వం వహిస్తుండటంతో అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకుని వస్తువులను జప్తు చేస్తున్నారు.
Election Code In Telangana : ప్రధానంగా నాయకుల బొమ్మలు, పార్టీ గుర్తులు కలిగిన బెడ్ షీట్లు, టవళ్లు, సైకిళ్లు, మోటార్ సైకిళ్లు, క్రికెట్ కిట్లు, జిమ్ పరికరాలు, బంగారం, వెండి, ఆభరణాలు వంటి 26 రకాల వస్తువులను జప్తు చేయాలని ఎన్నికల సంఘం ఓ జాబితా ఇచ్చినట్లు తెలుస్తోంది. గత పది రోజులుగా రైల్వే పార్సిల్ కార్యాలయాలు, ట్రాన్స్‌పోర్టు గోడౌన్లు, ప్రైవేటు బస్సుల పార్సెల్ కేంద్రాలు, కొరియర్ సర్వీస్ కేంద్రాలు తదితర వాటిపైప్రత్యేక బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయి. స్వాధీనం చేసుకున్న వస్తువులపై పార్టీలకు చెందిన స్టిక్కర్లు, పోటీలో నిలబడే నాయకుల బొమ్మలు ఉన్నట్లు తెలుస్తోంది. బిల్లులు ఉండి సరఫరా చేస్తున్నట్లయితే వాటిని ఆయా నాయకుల ఎన్నికల ఖర్చులో జమ చేస్తున్నట్లు వాణిజ్య పన్నుల శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.