తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీజేఐ జస్టీస్ ఎన్వీ రమణ. రాష్ట్రంలో నూతన జ్యుడీషియల్ జిల్లాల వ్యవస్థను సీఎం కేసీఆర్‌తో కలిసి వర్చువల్‌గా ఆయన ప్రారంభించారు. కోర్టుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. కొత్త భవనాలకు 21 జిల్లాల్లో తెలంగాణ ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. కొత్త భవనాలకు బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించింది. జ్యుడీషియల్ జిల్లాల ద్వారా సామాన్యులకు సత్వర న్యాయం అందనుంది.
చరిత్రలో నిలిచిపోతుంది: అన్ని వర్గాల వారు మహోన్నత ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నారని సీజేఐ పేర్కొన్నారు. ఉద్యమకారులు, మేధావులు, న్యాయవాదులకు అభినందనలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి న్యాయశాఖ అభివృద్ధికి కూడా ముఖ్యమని సీఎం అర్థం చేసుకున్నారని అన్నారు. న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఎలాంటి అపోహలు లేకుండా ప్రజలు కోర్టులకు వెళ్లే పరిస్థితి ఉండాలని సూచించారు. తెలంగాణ నేడు ఒక కొత్త అధ్యాయానికి తెర తీసిందని అన్నారు. పాలన వికేంద్రీకరణతో పాటు న్యాయవ్యవస్థ వికేంద్రీకరణ కూడా జరుగుతోందని తెలిపారు. ఒకేసారి కొత్తగా 23 జిల్లా కోర్టులు ఏర్పాటు చేయటం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు.
నిధులు మంజూరు చేయడం హర్షణీయం: జిల్లా కోర్టుల విభజన వల్ల ఉమ్మడి జిల్లా కోర్టులపై భారం తగ్గుతోందని స్పష్టం చేశారు. కోర్టుల సంఖ్యకు అనుగుణంగా న్యాయ సిబ్బందిని నియమించాలని అన్నారు. ఇటీవల జాతీయ స్థాయిలో జరిగిన న్యాయసదస్సులో కీలక అంశాలపై చర్చించామని తెలిపారు. న్యాయస్థానాల్లో మౌలిక వసతులు పెరగాలని ప్రధానంగా సూచించామన్నారు. సీఎం కేసీఆర్ కొత్త కోర్టుల భవనాలకు నిధులు మంజూరు చేయటం హర్షణీయమని వెల్లడించారు. వికేంద్రీకరణ వల్ల న్యాయవ్యవస్థ పటిష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. సామాజిక న్యాయం, మహిళ న్యాయానికి పెద్దపీట వేస్తున్నామన్నారు.
''అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకు సీఎం సహకరించారు. అడిగిన వెంటనే ఆర్బిట్రేషన్ సెంటర్‌కు భవనం, స్థలం కేటాయించారు. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యంతో పాటు న్యాయం కూడా దక్కాలి. కొత్త జ్యుడీషియల్ కోర్టులకు అనుగుణంగా సిబ్బంది కూడా పెరగాలి. కమర్షియల్ వివాదాల కోర్టులను పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో క్రమపద్ధతిలో న్యాయవ్యవస్థ పటిష్టతకు కృషి జరుగుతోంది. ఐటీ రంగం సేవలను రాష్ట్ర న్యాయశాఖ వినియోగించుకోవాలి.'' - సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
పరిధులు దాటొద్దు: న్యాయవ్యవస్థ ఏ ఒక్కరి ప్రయోజనం కోసమో పనిచేయదని ఈ సందర్భంగా సీజేఐ తెలిపారు. ఇటీవల కొందరు కోర్టు తీర్పులకు వక్రబాష్యాలు చెప్తున్నారని మండిపడ్డారు. సమాజం, ప్రజలందరి సంక్షేమమే న్యాయవ్యవస్థకు ముఖ్యమని స్పష్టం చేశారు. వ్యవస్థను చక్కబెట్టుకోలేని కొందరు కోర్టులను తప్పుబడుతున్నారని ఉద్ఘాటించారు. పరిధులు దాటి మాట్లాడితే రాజ్యాంగపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. న్యాయవ్యవస్థపై అవగాహన లేని వారికి కొన్ని సీజేఐ కొన్ని సూచనలు చేశారు.
సీజేఐ జస్టీస్ ఎన్వీ రమణ సూచనలు
- న్యాయవ్యవస్థ కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేయదు
- వ్యవస్థ ప్రయోజనం, సమాజ శ్రేయస్సే న్యాయవ్యవవస్థకు ముఖ్యం
- ఉన్నతస్థానంలో ఉన్నవారిపై అభాండాలు వేస్తున్నారు
- పరిధులు దాటనంత వరకు న్యాయవ్యవస్థకు అందరూ మిత్రులే
- పరిధులు దాటిన వారిని ఉపేక్షించడం రాజ్యాంగ విరుద్ధం
- ప్రజాస్వామ్యం నిలబడాలంటే న్యాయవ్యవస్థ చాలా ముఖ్యం
- నిష్పక్షపాత, బలమైన, స్వేచ్ఛాయుత న్యాయవ్యవస్థ అవసరం