ఏపీ విజయవాడ అగ్నిప్రమాదంపై 6 రోజులపాటు దర్యాప్తు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ.. స్వర్ణప్యాలెస్ నిబంధనల ఉల్లంఘనే ప్రమాదతీవ్రతకు కారణమని అభిప్రాయపడింది. 12 ఏళ్లుగా హోటల్ యాజమాన్యం పూర్తిగా నిబంధనలను ఉల్లంఘించిందని పేర్కొంది. హోటల్ భవనానికి అగ్నిమాపకశాఖ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ... పట్టించుకోలేదని, ట్రేడ్ లైసైన్స్ కోసం దరఖాస్తు చేసినప్పుడూ అధికారులకు సరైన వివరాలు అందించలేదని తెలిపింది.
'స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదానికి నిర్లక్ష్యమే కారణం' - స్వర్ణప్యాలెస్ ఘటనపై కమిటీ నివేదిక
ఏపీ విజయవాడలోని స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదానికి హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని.. జిల్లా కమిటీ నివేదిక పేర్కొంది. ఆ నివేదికను కలెక్టర్ ఇంతియాజ్ ప్రభుత్వానికి అందజేశారు. కొవిడ్ కేర్ కేంద్రాల నిర్వహణ తీరు పరిశీలనలో డీఎంహెచ్ఓ బాధ్యతలు సరిగా నిర్వర్తించలేదని నివేదిక వెల్లడించింది. 12 ఏళ్లుగా హోటల్ యాజమాన్యం పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ... అగ్నిమాపకశాఖ తనిఖీలు చేయకపోవటం బాధ్యతారాహిత్యమని అభిప్రాయపడింది.
కనీసం అగ్నిప్రమాదం తలెత్తితే ప్రమాదం నుంచి బయటపడేసే వ్యవస్థలను ఏర్పాటు చేసుకోలేదని తెలిపింది. ఈ నిర్లక్ష్యమే 10 మంది మృతికి దారితీసిందని పేర్కొన్నట్లుగా సమాచారం. 18 మీటర్ల కంటే ఎత్తుగా ఉన్న వాణిజ్య భవనాలను.. అగ్నిమాపకశాఖ అధికారుల నిరంతరం పర్యవేక్షించాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోలేదని తెలిపింది. అత్యంత రద్దీ ప్రదేశంలో 19.4 మీటర్ల ఎత్తులో ఉన్న హోటల్‌లో తనిఖీలు చేయకపోవటం బాధ్యతారాహిత్యమేనని స్పష్టం చేసింది.
రమేశ్ ఆసుపత్రి యాజమాన్యం కూడా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిందని నివేదిక పేర్కొంది. కొవిడ్ నిబంధనలు పట్టించుకోలేదని, చికిత్స కోసం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటించలేదని చెప్పింది. కొవిడ్ కేర్ నిర్వహించే భవనంలో అగ్నిమాపక అనుమతులు ఉన్నాయో లేవో అని పరిశీలించకుండానే చికిత్స కేంద్రం ఏర్పాటు చేశారని తెలిపింది. నిర్వహణ తీరుపై జిల్లా యంత్రాంగానికి నివేదిక ఇవ్వాల్సిన డీఎంహెచ్ఓ సక్రమంగా బాధ్యతలు నిర్వహించలేదని నివేదిక అభిప్రాయపడింది.