తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓ వైపు చలి.. మరో వైపు పొగమంచు.. జర జాగ్రత్త సుమా..!

Cold Effect on Telangana : రాష్ట్రంలో చలిపులి పంజా విసురుతోంది. చలిగాలులు, మంచు కారణంగా ప్రజలు గజగజ వణుకుతున్నారు. పలుచోట్ల ఉదయం 4 గంటలకు వీస్తున్న శీతల గాలులతో భూ వాతావరణంపై పొగమంచు ఏర్పడుతోందని.. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Telangana
Telangana

By

Published : Jan 12, 2023, 8:11 AM IST

Cold Effect on Telangana : రాష్ట్రంలో పెరుగుతున్న చలి వణికిస్తోంది. బుధవారం తెల్లవారుజామున అత్యల్పంగా హైదరాబాద్‌ శివారులోని మంగళపల్లిలో 7.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శంషాబాద్‌ విమానాశ్రయంలో 9.2, మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల, హైదరాబాద్‌ శివారులోని శివరాంపల్లిలో 9.9, పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో 10.7, పటాన్‌చెరులో 11.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలుచోట్ల ఉదయం 4 గంటలకు వీస్తున్న శీతలగాలులతో భూ వాతావరణంపై పొగమంచు ఏర్పడుతోందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న సూచించారు.

ఎక్కువగా రహదారులు, పొలాలపై పొగమంచు దట్టంగా ఏర్పడుతోంది. దక్షిణ భారతం నుంచి తక్కువ ఎత్తులో రాష్ట్రంలోకి గాలులు వీస్తున్నందున గురు, శుక్రవారాల్లో చలి తీవ్రత కొంత తగ్గి ఆ తర్వాత మళ్లీ పెరుగుతుందని నాగరత్న తెలిపారు. నగరాలు, పట్టణాల్లో వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే పొగకు మంచు కలవడం వల్ల కాలుష్య తీవ్రత మరింత పెరుగుతుంది. శ్వాస తీసుకునేటప్పుడు ఊపిరితిత్తుల్లోకి చేరడం వల్ల అనారోగ్యం బారినపడే అవకాశం ఉంటుంది.

అత్యవసరమైతే తప్ప బయట తిరగడం మంచిది కాదు:పొగమంచు కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప బయట తిరగడం మంచిది కాదని, ఎండ వచ్చిన తర్వాతే వాకింగ్‌కు వెళ్లడం మంచిదని నాగరత్న తెలిపారు. జడ్చర్ల, శివరాంపల్లి, పటాన్‌చెరు, పాశమైలారం తదితర ప్రాంతాల్లో పొగమంచు (స్మోగ్‌) ఏర్పడుతోంది. హైదరాబాద్‌ -బెంగళూరు జాతీయ రహదారిపై కొత్తూరు, జడ్చర్ల; పలు ఇతర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నందున పొగమంచు కురుస్తోంది.

పలు రాష్ట్రాల్లో ప్రమాదాలు..: పొగమంచుతో ఉదయం పూట పలు రాష్ట్రాల్లో రహదారులపై 50 మీటర్లకు మించి రోడ్డు కనిపించకపోవడంతో వాహనాలు ఢీ కొంటూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం పొగమంచు కారణంగా రాత్రిపూట ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేసింది. ఆ రాష్ట్రంలోని సీతాపుర్‌ వద్ద.. ముందు వెళుతున్న ట్రక్కు పొగమంచులో కనిపించకపోవడంతో ఒక వ్యాను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. బులంద్‌షహర్‌-అలీగఢ్‌ రహదారిపైనా ఇటీవల పొగమంచులో అనేక వాహనాలు ఢీకొనడంతో ఒక డ్రైవర్‌ మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఇవీ చదవండి:సంక్రాంతి కానుక.. 15న కూతపెట్టనున్న వందేభారత్​ రైలు

21 పార్టీల నేతలకు ఖర్గే లేఖ.. 'భారత్ జోడో యాత్ర' ముగింపు సభకు ఆహ్వానం

ABOUT THE AUTHOR

...view details