ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల’(ప్యాక్స్) ఎన్నికల సమరం ప్రారంభమైంది. ఒంటిగంట వరకూ పోలింగ్ జరగనుంది. ఓ గంట విరామం అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. సాయంత్రానికల్లా ఫలితాలు వెల్లడించి విజేతలకు సహకార శాఖ ‘గెలుపు ధ్రువీకరణ పత్రం’ జారీ చేయనుంది.
7 వార్డులు గెలిస్తే ఛైర్మన్ పదవి
రాష్ట్రంలో మొత్తం 909కు నాలుగు సంఘాల పాలకవర్గాల పదవీకాలం పూర్తికాలేదని ఎన్నికలు నిర్వహించడం లేదు. మిగిలిన 905లో ఇప్పటికే ఏకగ్రీవంగా 157 సంఘాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఒక్కో సంఘంలో 12 నుంచి 13 చొప్పున వార్డులున్నాయి. వీటినే ప్యాక్స్ ప్రాదేశిక నియోజకవర్గం అంటారు. ఒక సంఘంలో కనీసం 7 వార్డులు గెలిస్తే ఛైర్మన్ పదవి దక్కుతుంది.
ఈనెల 17 లేదా 18న పాలకవర్గాలకు నోటిఫికేషన్
వార్డు సభ్యులుగా ఎన్నికయ్యేవారు ఆది, సోమవారాల్లో ప్యాక్స్‌కు ఛైర్మన్లను ఎన్నుకుంటారు. ఈ ఛైర్మన్ల నుంచి ‘జిల్లా కేంద్ర సహకార బ్యాంకు’(డీసీసీబీ), జిల్లా కేంద్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య(డీసీఎంఎస్), రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య(మార్క్‌ఫెడ్)లకు పాలకవర్గాలను ఎన్నుకుంటారు. ప్యాక్స్ ఛైర్మన్ల ఎన్నికలు పూర్తయ్యాక ఈనెల 17 లేదా 18న డీసీసీబీ, డీసీఎంఎస్ పాలకవర్గాల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేస్తామని సహకార కమిషనర్ వీరబ్రహ్మయ్య ఈటీవీ భారత్‌కు చెప్పారు.
"ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేశాం. పార్టీరహితంగా ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 11.48 లక్షల మంది ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం కల్పించాం" - సహకార కమిషనర్ వీరబ్రహ్మయ్య
సహకార సమరం: మధ్యాహ్నం లెక్కింపు, సాయంత్రం ఫలితాలు పోటాపోటీ దూకుడు - లోలోపల ప్రచారం
- సహకార ఎన్నికలు పార్టీ రహితమైనా ప్రధాన పార్టీలు తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. తమ మద్దతుదారులకే ఓటు వేసి గెలిపించాలని శనివారం రాత్రి లోలోపల ప్రచారం చేశారు.
- కొన్నిచోట్ల ఓటుకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు పంచినట్లు ప్రచారం జరుగుతోంది. డీసీసీబీ, డీసీఎంఎస్, మార్క్‌ఫెడ్ పాలకవర్గాలకు రాష్ట్రస్థాయి పదవులుగా గుర్తింపు ఉంది. వాటిని చేజిక్కించుకోవాలని ఆశలు పెట్టుకున్న నేతలు తొలుత ప్యాక్స్‌లో నెగ్గాల్సి ఉన్నందున తమ తరఫున కచ్చితంగా 7 నుంచి 8 మంది వార్డు సభ్యులు గెలిచేందుకు అన్నీ సమకూరుస్తున్నారు.
- కొన్నిచోట్ల తెరాస గట్టిగా ఉన్నందున విడివిడిగా పోటీచేస్తే నెగ్గలేమని భాజపా, కాంగ్రెస్, ఇతర పక్షాల నేతలు ఒకరికొకరు పరస్పరం మద్దతిచ్చుకుంటున్నాయని ఓ జిల్లా నాయకుడు వివరించారు. ఇప్పటికే ఏకగీవ్రమైనవన్నీ అధికార తెరాస మద్దతుదారులవేనని నేతలు చెబుతున్నారు.
- అధికార పార్టీ మద్దతుదారులనే గెలిపిస్తే రైతు సంక్షేమ పథకాలు పక్కాగా, వేగంగా అమలుచేయడానికి అవకాశం ఉంటుందని నేతలు ప్రచారం చేశారు. ఆర్థికంగా బలంగా ఉన్న సంఘాల్లో పదవులు దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు.
- రైతులే సంఘాల్లో సభ్యులుగా ఉండాలి. భూముల యజమానులైన వారు సభ్యులుగా ఉన్నా కొందరు నేరుగా పంటలు పండించడం లేదు. కానీ వారు ఈ ఎన్నికల్లో నెగ్గేందుకు బరిలోకి దిగి గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
- ఎకరా లేదా 2 ఎకరాల రైతుల సంఖ్యే రాష్ట్రంలో అధికంగా ఉంది. కానీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో అలాంటి చిన్న రైతులు నామమాత్రమేనని సహకార అధికారి ఒకరు వివరించారు.
ఇవీ చూడండి:అలా చేస్తే ఉద్యోగం నుంచి శాశ్వతంగా తీసేస్తాం: కేటీఆర్