పాతబస్తీలో ఆలయాల భూముల పరిరక్షణపై ముఖ్యమంత్రి స్పందించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. దేవాలయ భూములు కాపాడాలని కోరిన తమ కార్యకర్తలను అరెస్ట్ చేశారని.. వారిని కలవడానికి వెళితే డీసీపీ అడ్డుకున్నారని బండి అన్నారు. సాక్షాత్తు డీసీపీ కబ్జాదారులకు కొమ్ముకాశారని సంజయ్ ఆరోపించారు. ఈ ఘటనపై సీఎం, డీజీపీ స్పందించాలని డిమాండ్ చేశారు. ఆ కబ్జా భూములను స్వాధీనం చేసుకుని దేవాదాయ శాఖకు అప్పగించాలన్నారు. పోస్టింగ్, అవార్డు, రివార్డుల కోసం భాజపా కార్యకర్తలను నిలువరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీసీపీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇవాళ తమ ఓపిక వల్లే పాతబస్తీ ప్రశాంతంగా ఉందని.. 24 గంటల్లో పాతబస్తీలోని దేవాలయ భూముల పరిరక్షణపై ముఖ్యమంత్రి స్పందించని పక్షంలో భాజపా చేసే ఉద్యమానికి.. బాధ్యత వహించాల్సి ఉంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.