CM Revanth Speech At Davos :పెట్టుబడులే లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన ముగిసింది. చివరి రోజు దావోస్ కేంద్రంగా రాష్ట్రంలో పెట్టుబడులపై మరిన్ని ఒప్పందాలు జరిగాయి. వివిధ కంపెనీల యాజమాన్యాలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. యూకేకి చెందిన సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ రూ.231 కోట్లతో హైదరాబాద్‌లో వైద్య పరికరాల తయారీ పరిశ్రమను నెలకొల్పనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎస్ఐజీహెచ్ ఎండీ గౌరి శ్రీధర, డైరెక్టర్ అమర్ చర్చల అనంతరం ఒప్పందం జరిగింది.
CM Revanth Reddy Davos Tour :మొదటి దశలో సర్జికల్, ఆర్థోపెడిక్, ఆఫ్తమాలిక్ పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. రెండో దశలో రోబోటిక్ వైద్య పరికరాలను ఉత్పత్తి చేయనుంది. రానున్న రెండు, మూడేళ్లలో పరిశ్రమ పూర్తిస్థాయిలో ఏర్పాటు కానుంది. ఉబర్ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా రెండు కొత్త ప్రాజెక్టులనుచేపట్టేందుకు ముందుకొచ్చింది.
హైదరాబాద్‌లో ఉబర్గ్రీన్ :అమెరికా తర్వాత అతి పెద్ద టెక్ సెంటర్‌ను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఉబర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ద్వారా తమ మొబిలిటీ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు వెల్లడించింది. ఉబర్ గ్రీన్ పేరుతో ఎలక్ట్రికల్ వాహనాలు, ఎక్కువ కెపాసిటీ ఉన్న వాహనాలతో ఉబర్ షటిల్ సేవలను ప్రవేశపెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కొత్త ప్రాజెక్టులో సుమారు వెయ్యిమందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.
రైతులకు కార్పొరేట్ తరహా లాభాలు రావాలనేదే నా స్వప్నం: సీఎం రేవంత్
రాష్ట్రంలో వ్యాపార కార్యకలాపాలు విస్తరించేందుకు టాటా సన్స్ గ్రూప్(TATA Group Investments in Telangana) సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని యాభై ఐటీఐలను రూ.1500 కోట్లతో స్కిల్ సెంటర్లుగా అభివృద్ధి చేయడంతో పాటు వివిధ రంగాల్లో విస్తరణకు ప్రణాళిక చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డికి టాటా సన్స్ గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు. టీసీఎస్, టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్, టీటీఎల్, ఎయిరిండియా కార్యకలాపాలు విస్తరణపై చర్చించారు.
హైదరాబాద్‌లో ఐటీ సేవలను విస్తరించేందుకు 'క్యూ సెంట్రియో'(Cue centrio Telangana) సంస్థ ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో సప్లయ్ స్కిల్స్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు 'ఓ నైన్' సంస్థ అంగీకరించింది. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబుతో క్యూ సెంట్రియో కంపెనీ ప్రతినిధి ఎలమర్తి, ఓ నైన్ సీఈవో చక్రి గొట్టిముక్కుల సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో అధునాతన డిజిటల్ డిజైన్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో సిస్ట్రా గ్రూప్ ఒప్పందం చేసుకుంది.