CM Revanth Reddy Team Reached Zurich Airport : సమగ్ర అభివృద్ధితో కూడిన సరికొత్త తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు ప్రవాస భారతీయ ప్రముఖులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy) పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడంతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం మధ్యాహ్నం జ్యూరిచ్ చేరుకుంది.
ఇంటింటా కొత్త కాంతులు వెల్లివిరియాలి - హ్యాపీ సంక్రాంతి : సీఎం రేవంత్ రెడ్డి
విమానాశ్రయంలో పలువురు భారతీయ ప్రముఖులను కలిసి కొద్దిసేపు మాట్లాడటం చాలా సంతోషానిచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో రాష్ట్రానికి సంబంధించిన పెవిలియన్‌లో త్వరలో 'తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి' అనే ప్రచారం ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. దావోస్‌లో పలు అత్యున్నత స్థాయి వరస సమావేశాలు ఉంటాయని రేవంత్ రెడ్డి తెలిపారు. జ్యూరిచ్ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో దావోస్ వెళ్లారు.
CM Revanth Participate in Davos Meeting :మూడు రోజుల దావోస్ పర్యటనలో(Davos Meeting) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారుల బృందం దాదాపు 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలను కలవబోతున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. తాము సమావేశం కాబోతున్న వారిలో నొవార్టీస్, మెడ్ ట్రానిక్స్, ఆస్ట్రాజెంకా, గూగుల్, ఉబర్, మాస్టర్‌కార్డ్, బేయర్, ఎల్డీసీ, యూపీఎల్ తదితర అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు, సీఎఫ్‌వోలు ఉన్నారన్నారు. భారత్‌కు చెందిన టాటా, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, జేఎస్‌డబ్ల్యూ, గోద్రెజ్, ఎయిర్టెల్, బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులతో కూడా భేటీ అవ్వడమే కాకుండా సీఐఐ, నాస్కమ్ వంటి వ్యాపార ఛాంబర్స్ ప్రతినిధులతో భేటీ కానున్నట్లు తెలపారు.