CM Revanth Reddy Review on Irrigation Projects Today :తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించడం, తుది దశలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే పలుమార్లు నీటిపారుదల శాఖపై సీఎం, మంత్రి సమావేశాలు నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే ఆదివారం మధ్యాహ్నం తొలుత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy)మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు.
CM Revanth Irrigation Projects Review Meeting :ఈ నేపథ్యంలో ఆరు నెలలు, ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు ఇలా నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయగలిగిన ప్రాజెక్టుల జాబితాను ఆ శాఖ సిద్ధం చేసింది. ఏ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేస్తే ఎంతకాలంలో ఆయకట్టు సాగులోకి తీసుకురావచ్చన్న కోణంలో రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తుండటంతో, ఆ మేరకు నివేదికలు రూపొందించింది. ప్రాజెక్టులు, కాలువలు, పంప్‌హౌస్‌లు, డిస్ట్రిబ్యూటరీలు, ప్రాజెక్టుల వెనుక భాగంలో ఉన్న, సాగునీరు అందని (గ్యాప్) ఆయకట్టుకు ఎలా నీరందించాలి, చిన్నతరహా ఎత్తిపోతల నిర్మాణాలు ఎక్కడ చేపట్టాలనే వివరాలనూ నీటిపారుదల శాఖ సిద్ధం చేసినట్లు తెలిసింది.
ఆ టెండర్లకు సర్కార్ స్వస్తి! :పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో(Palamuru Rangareddy Lift Irrigation Scheme) గతేడాది చివర్లో పిలిచిన కాలువల టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. వట్టెం, కరివెన, ఉదండాపూర్ జలాశయాల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం గతేడాది 11 టెండర్లను సిద్ధం చేయగా, అందులో ఏడింటికి ప్రాధాన్యం ఇచ్చింది. రూ.3747.49 కోట్లతో ఉదండాపూర్ కింద ఐదు పనులు, కరివెన కింద రెండు పనులకు గత సెప్టెంబరులో టెండర్లు పిలిచింది. కాగా అక్టోబరు రెండోవారంలో వాటిని తెరిచింది.