CM Revanth Reddy Review Officials :రైతుభరోసా, పింఛన్లపై అపోహలు వద్దని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతుభరోసా, పింఛన్లు కొత్తగా కావాలనుకునే వారు మాత్రమే ప్రజాపాలన సదస్సుల్లో దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు. ఇప్పటికే పింఛన్, రైతుబంధు పొందుతున్న లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంపై సీఎస్ శాంతికుమారి, సీఎం కార్యదర్శి శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులతో సచివాలయంలో, రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై రేవంత్‌రెడ్డి ఆగ్రహం : ప్రజల నుంచి భారీ స్పందన వస్తోందని, రెండు రోజులుగా సుమారు పదిహేనున్నర లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయనిసీఎం రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy), అధికారులు వివరించారు. ఈరోజు ఉదయం నుంచి కూడా అర్జీదారులు బారులు తీరారని తెలిపారు. దరఖాస్తుల కొరత, నిబంధనలపై అనుమానాలపై సమీక్షలో జరిగింది. ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని అర్జీలు అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను, ఆయన ఆదేశించారు.
ప్రజాపాలన కార్యక్రమంలో గలాటా - ఎంపీపీ, ప్రజల మధ్య వాగ్వాదం
దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు : దరఖాస్తుదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి, అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజాపాలన క్యాంపుల్లో దరఖాస్తుదారులకు తాగునీరు, టెంట్లు, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని అధికారులకు మరోసారి స్పష్టం చేశారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని రేవంత్‌రెడ్డి అన్నారు.