CM Revanth Reddy Review Meeting Praja Palana Applications Today : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రజాపాలన తదుపరి కార్యక్రమంపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రజాపాలన, ఆరు గ్యారెంటీల అమలు కార్యాచరణపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కొత్త పథకాలకు సంబంధించి ఆదాయ మార్గాలు, అభయహస్తం పథకాల అమలు ప్రారంభం గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన Prajapalana.telangaana.gov.in వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తారు.
ప్రజల నుంచి అనూహ్య స్పందన : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామన్న గ్యారెంటీలకు(Praja Palana Program in Telangana) ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకు నిర్వహించిన ప్రజాపాలనలో రాష్ట్రవ్యాప్తంగా 1,24,85,383 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో ఐదు పథకాల కోసం 1,05,91,636 దరఖాస్తులు రాగా, రేషన్ కార్డులు, ఇతర అంశాలపై 19,92,747 ఉన్నాయి. తెలంగాణలో 1,11,46,293 కుటుంబాల పరిధిలోని 16,392 పంచాయతీలు, 710 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన గ్రామ సభలను నిర్వహించారు.
నెల రోజుల ప్రస్థానంపై రేవంత్ ట్వీట్ - 'మీ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా నా బాధ్యత నిర్వర్తిస్తా'
దరఖాస్తుల సమాచారం 17లోగా ఆన్‌లైన్‌లోకి : ప్రజాపాలనలో మొత్తం 3714 అధికార బృందాలు 44,568 కౌంటర్ల ద్వారా అర్జీలు స్వీకరించారు. దరఖాస్తుల్లోని సమాచారాన్ని మండల, మున్సిపల్ కేంద్రాల్లో కంప్యూటరీకరిస్తున్నారు. ఈ నెల 17 వరకు డేటా ఎంట్రీ పూర్తి కానుంది. రేషన్, ఆధార్ కార్డు నంబర్ల ఆధారంగా అసలైన లబ్ధిదారులు ఎంత మంది ఉంటారు, పథకాల అమలుకు ఎన్ని నిధులు అవసరమనే ప్రాథమిక అంచనాకు రానున్నారు.