CM Revanth Reddy Review Meeting on TSPSC :రాష్ట్రంలో టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. యూపీఎస్సీ విధానంపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లపై అధ్యయనం చేయాలని, సమగ్ర అధ్యయం చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. నియామకాలు పారదర్శకంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సీఎం తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కమిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఛైర్మన్, సభ్యుల నియామకాలు పారదర్శకంగా జరగాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) నిర్వహించిన పరీక్షా పత్రాల లీకేజీ అంశానికి సంబంధించిన వివరాలు, కేసు పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. టీఎస్పీఎస్సీపై సచివాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, పోలీసు ఉన్నతాధికారులు, కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్, తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు, ఛైర్మన్ సహా సభ్యుల నియామకానికి సంబంధించిన అర్హతలు, ఇతర అంశాల గురించి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆరా తీశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటి వరకు చేసిన నియామకాలు, మిగిలిన నియామకాల ప్రస్తుత స్థితి, పరీక్షల నిర్వహణ, సంబంధిత అంశాలపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. గ్రూప్ 1, ఏఈఈ, తదితర పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు.
కేసు పురోగతి, ఇప్పటి వరకు జరిగిన విచారణ, తదుపరి కార్యాచరణ సహా అన్ని అంశాల గురించి పోలీసుల ఉన్నతాధికారుల ద్వారా సీఎం తీసుకున్నారు. ఇతర పరీక్షల తేదీలు, నిర్వహణ అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని పరిస్థితులకు అనుగుణంగా కమిషన్ తగిన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి అంశంపై కూడా సమీక్షలో రేవంత్ రెడ్డి అడిగారు. అలాగే పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సైతం సమీక్ష జరిపారు. టీఎస్పీఎస్ ఛైర్మన్ రాజీనామా చేయగానే అశోక్ నగర్లో ఉన్న నిరుద్యోగులు సంబురాలు చేసుకున్నారు. ఒకరిని ఒకరు పరస్పరం కౌగిలించుకుంటూ మిఠాయిలు తినిపించుకుని ఆనందం వ్యక్తం చేశారు.