CM Revanth Reddy on Budget :రాష్ట్ర ఆదాయ, వ్యయాల వాస్తవికతను ప్రతిబింబించేలా వచ్చే సంవత్సరానికి బడ్జెట్ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, లక్ష్యాలను, ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చెబుదామని సీఎం దిశానిర్దేశం చేశారు. అసలైన తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని బడ్జెట్ తయారు చేయాలని ఆధికారులను సూచించారు. వృథా ఖర్చులు తగ్గించాలని చెప్పారు.
సచివాలయంలో(Secretariat) సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆదాయం, ఉద్యోగుల జీతభత్యాలు, హామీల అమలుకు ఖర్చు ఎంతనే అంచనాలు పక్కాగా ఉండాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.అప్పులు, చెల్లించాల్సిన బకాయిలు, నెలసరి ఖర్చులన్నింటిపై స్పష్టత ఉండాలని తెలిపారు. దాపరికం లేకుండా ఆదాయ, వ్యయాల ముఖచిత్రం ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలని సీఎం సూచించారు.
CM Revanth Reddy about Financial Budget : కొందరు వ్యక్తులను సంతృప్తిపరచాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రజలను సంతృప్తి పరచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అధికారులకు సీఎం గుర్తు చేశారు. అందుకే ప్రజల కోణంలో బడ్జెట్ ఉండేలా ప్రత్యేక కసరత్తు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కోరారు. గతంలో మాదిరిగా అప్పులు దాచి, ఆదాయ వ్యయాలను(expenses) భూతద్దంలో చూపించాల్సిన అవసరం లేదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.