CM Revanth Reddy Meets With Foxconn Representatives :రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్‌లో ఉన్న ఫాక్స్‌కాన్ కంపెనీ నిర్వహణకు పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. ఆ కంపెనీ భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టులకు కూడా సహకరిస్తామని హామీ ఇచ్చారు. యాపిల్ ఫోన్, అనుబంధ పరికరాలు తయారు చేసే తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ సంస్థకు కొంగర కలాన్‌లో గత ప్రభుత్వం సుమారు 120 ఎకరాలు కేటాయించింది. లక్ష ఉద్యోగాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వంతో ఫాక్స్‌కాన్ కంపెనీ ఒప్పందం చేసుకుంది.
ఫాక్స్ కాన్ ను బెంగళూరు తరలించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ ఎన్నికల సమయంలో ప్రచారం జరిగింది. కానీ నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫాక్స్‌కాన్(Foxconn)కు చెందిన హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి బృందం కలిసింది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంభిస్తున్నామని సీఎం తెలిపారు.
CM Revanth Reddy Meets Foxconn Delegations : పారిశ్రామిక వేత్తలకు కూడా పూర్తి సహాయ, సహకారాలందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను సులభంగా అందించడంతో పాటు, మౌలిక సదుపాయాలను కల్పిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల ఆకాంక్షలను కాపాడే బాధ్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆ రాష్ట్రం నుంచి 'ఫాక్స్‌కాన్' ఔట్! ఏ ప్రభావం ఉండదన్న మంత్రి.. కాంగ్రెస్ ఫైర్!