CM Revanth Reddy Help Swiggy Boy Family :సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. గతంలో కేసీఆర్‌ను పరామర్శించడానికి యశోద ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఒక మహిళ అన్నా అని పిలిస్తే వెంటనే ఆమె వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే అధికారులకు ఆదేశాలు ఇస్తూ తన తండ్రికి అయ్యే ఆసుపత్రి ఖర్చును చూసుకోవాలని సూచించారు.
అలాగే పోలీసు శాఖ సమీక్షలో తెలంగాణ ఉద్యమ సమయంలో డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళిని(Nalini)కి మళ్లీ ఉద్యోగ ఆఫర్ ఇచ్చారు. వీటన్నింటి కంటే ముందు ప్రమాణ స్వీకారం రోజునే దివ్యాంగురాలికి ఉద్యోగం ఇచ్చే దస్త్రంపై సంతకం చేశారు. ఇలా ఎప్పటికప్పుడు తన మంచి మనసు చాటుకుంటూ మనసున్న నేత అని మరోసారి రుజువు చేసుకున్నారు. అయితే మళ్లీ ఇప్పుడు ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్(Swiggy Delivery Boy) కుటుంబానికి రూ.2 లక్షలు ఆర్థిక సహాయం చేశారు.
స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి సీఎం రూ.2 లక్షల ఆర్థిక సాయం : వివరాల్లోకి వెళితే ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ రిజ్వాన్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. హైదరాబాద్‌లో నాలుగు నెలల క్రితం స్విగ్గీ ఆర్డర్ ఇచ్చేందుకు ఒక అపార్టుమెంట్లోకి వెళ్లి రిజ్వాన్ కుక్క నుంచి తప్పించుకోబోయి భవనంపై నుంచి పడి మరణించారు. ఈ విషయంపై ఇటీవల ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో గిగ్ వర్కర్స్‌తో జరిగిన సమావేశంలో ఈ స్విగ్గీ బాయ్ ప్రస్తావన వచ్చింది.
గత ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తుందని ఎదురు చూశామని గిగ్ వర్కర్స్ తెలిపారు. ఆ కుటుంబ వివరాలు తెలుసుకొని రూ.2 లక్షల ఆర్థిక సాయం చేయాలని అదే రోజున అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు ఇవాళ సచివాయంలో రిజ్వాన్ కుటుంబ సభ్యులకు సీఎం సహాయ నిధి కింద రూ.2 లక్షల చెక్కును అందించారు.