CM Revanth Reddy Delhi Tour Updates: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) తరహాలో పటిష్ఠమైన వ్యవస్థగా మార్చాలని నిర్ణయించామని, అందుకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యూపీఎస్సీ ఛైర్మన్ మనోజ్ సోనిని కోరారు. దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి శుక్రవారం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిలతో కలిసి యూపీఎస్సీ భవన్‌లో ఛైర్మన్ మనోజ్ సోని, కార్యదర్శి శశిరంజన్ కుమార్‌లతో భేటీ అయ్యారు. యూపీఎస్సీ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేసి, నిర్దిష్ట కాల పరిమితిలోగా పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి పారదర్శకంగా నియామక ప్రక్రియ పూర్తి చేయడం అభినందనీయమని ప్రశంసించారు.
Revanth Reddy Meet UPPSC Chairman : యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను తీర్చిదిద్దే అంశంపై గంటన్నర పాటు సీఎం ఛైర్మన్(Revanth Reddy Explained TSPSC Position)తో చర్చించారు. అవినీతి మరక అంటకుండా నియామకాలు పూర్తి చేయడానికి యూపీఎస్సీ అనుసరిస్తున్న విధానాల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. తాము ఈ ఏడాది డిసెంబరు నాటికి 2 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని భావిస్తున్నామని, ఇందుకు తగ్గట్టు టీఎస్‌పీఎస్సీని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలనుకుంటున్నామని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. యూపీఎస్సీ ఛైర్మన్ సోని ముఖ్యమంత్రి ప్రయత్నాన్ని అభినందించడంతో పాటు యూపీఎస్సీ సభ్యుల నియామకంలో అనుసరిస్తున్న విధానాన్ని రేవంత్‌రెడ్డికి వివరించారు. సభ్యుల నియామకంలో రాజకీయ ప్రమేయం ఉండదని, సమర్థత ఆధారంగా ఎంపిక జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను యూపీఎస్సీ ఛైర్మన్ స్వాగతించారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌తో పాటు, సభ్యులకు తాము శిక్షణ ఇస్తామని హామీ ఇచ్చారు.
యూపీఎస్సీ ఛైర్మన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ - 'టీఎస్‌పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో బలోపేతం చేయాలి'
Revanth Reddy Meet Defense Minister Rajnath Singh: హైదరాబాద్‌లో రహదారులు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)తో కలిసి ఆయన శుక్రవారం సాయంత్రం కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. ట్రాఫిక్ రద్దీ నివారణ కోసం మెహిదీపట్నం రైతుబజార్ వద్ద స్కైవాక్ నిర్మిస్తున్నామని, ఇందుకోసం అక్కడ రక్షణ శాఖకున్న 0.21 హెక్టార్ల భూమిని బదలాయించాలని కోరారు. అందుకు రక్షణ మంత్రి సుముఖత వ్యక్తం చేశారు. హైదరాబాద్-రామగుండం రాజీవ్ రహదారిలో ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు జంక్షన్ వరకు ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్ ప్రవేశ, నిష్క్రమణ ర్యాంపులతో కలిపి 11.30 కిలోమీటర్ల కారిడార్ నిర్మాణానికి 83 ఎకరాల రక్షణ శాఖ భూమిని బదిలీ చేయాలని రాజ్‌నాథ్‌కు రేవంత్ విజ్ఞప్తి చేశారు.