CM Revanth Reddy Answered Akbaruddin Owaisi Questions : తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలపడమే తమ లక్ష్యమని, వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం(White Paper)పై అక్బరుద్దీన్ అనుమానం వ్యక్తం చేయడంపై ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. అర్హులకు సంక్షేమాన్ని అందించి దేశంలోనే తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఆర్ధిక శాఖ కార్యదర్శి సంతకం పెట్టి ఇచ్చిన నివేదికనే అసెంబ్లీ ముందు ఉంచామన్నారు.
ఆర్‌బీఐ, కాగ్ నుంచి సమాచారం తీసుకుని, అవసరమైన చోట వారి నివేదికలను ప్రస్తావించామని తెలిపారు. రాష్ట్ర నిధుల విషయంలో ఆర్‌బీఐ(RBI) రోజూ ఓ నివేదిక ఇస్తుందని చెప్పారు. 2014-15 మధ్యలో 300 రోజులు తమకు మిగులు నిధులు ఉన్నాయని, కానీ గత ఐదేళ్లలో కనీసం 150 రోజులు కూడా మిగులు నిధులు లేవని ధ్వజమెత్తారు. అప్పు కోసం రోజూ ఆర్‌బీఐ వద్ద నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వివరించారు.
ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి : వాస్తవాలు దాచి గొప్పలు చొప్పుకోబట్టే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. జీతాల ఆలస్యం వల్ల ఉద్యోగుల సిబిల్ స్కోరు(CIBIL Score) దెబ్బతింటోందని తెలిపారు. ఆఖరికి బ్యాంకులు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అప్పులు ఇవ్వట్లేదని చెప్పారు. వాస్తవాలు కఠోరంగా ఉన్నప్పుడు వాటిని అంగీకరించాలని సీఎం హితవు పలికారు. మన కుటుంబ సభ్యుడు ఒకరు తప్పు చేస్తే, ఆ తప్పును అంగీకరించాలని సూచించారు. ఈ వాస్తవాలు కొందరికీ చేదుగా ఉండొచ్చని, ఇంకొందరికీ కళ్లు తెరిపించవచ్చని చెప్పారు.
శాసనసభలో 42 పేజీల శ్వేతపత్రం - తెలంగాణ మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు