CM Revanth Counter to Harish Rao on Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టును రూ.80వేల కోట్లతో కట్టామనడం అబద్ధమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్(Kaleshwaram Corporation) రుణమే రూ.97,449 కోట్లు మంజూరైందని ఆయన తెలిపారు. శ్వేతపత్రంపై హరీశ్‌రావు మాట్లాడిన అనంతరం సీఎం తీవ్రంగా స్పందించారు. గత ప్రభుత్వం పెట్టిన ఖర్చు, తెచ్చిన రుణాలు కలిపితే అసలు లెక్క తేలుతుందని సీఎం అన్నారు.
శాసనసభలో 42 పేజీల శ్వేతపత్రం - తెలంగాణ మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు
CM Revanth Reddy on Kaleshwaram Project :కాళేశ్వరం నీటితో అభివృద్ధి చేస్తామని చెప్పి అప్పులు తెచ్చారని ముఖ్యమంత్రి ఆక్షేపించారు. కాళేశ్వరం నీటితో ఏటా రూ.5వేల కోట్లు సంపాదిస్తామని, అదేవిధంగా మిషన్ భగీరథతో(Mission Bhagiratha) రూ. 5,700 కోట్లు సంపాదిస్తామని చెప్పారన్నారు. ఇలా నీటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పి బ్యాంకులను మభ్యపెట్టితప్పుడు నివేదికలు ఇచ్చారని రేవంత్ ఆరోపించారు.
తొమ్మిదిన్నర సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప, ఇంకెవరూ సాగు నీటిపారుదల శాఖ మంత్రులుగా పనిచేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జరిగిన అవినీతిని, ప్రజలకు తెలియకుండా కప్పిపెట్టటానికి కుటుంబ సభ్యులంతా సాయశక్తులా ప్రయత్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును రూ.80వేల కోట్లతో కట్టామనడం అబద్ధం. కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి రూ.97,449 కోట్లు రుణం మంజూరైంది. కాగ్ నివేదిక ప్రకారం బడ్జెట్లో రాని అప్పులను తీసుకొచ్చి ఆదాయంగా చూపించి మొత్తం బ్యాంకులను, ప్రభుత్వం వ్యవస్థలను తప్పుపట్టినట్లు పేర్కొంది.-రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి