దిల్లీ నిజాముద్దీన్ సభలో పాల్గొని వచ్చిన వారి వల్ల కరోనా వ్యాధి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దిల్లీకి వెళ్లొచ్చిన వారి ఆచూకీని యుద్ధ ప్రాతిపదికన తెలుసుకొని వైద్య పరీక్షలు అందించాలన్నారు. ఆరుగురి మరణాల నేపథ్యంలో లాక్‌డౌన్, రాత్రిపూట కర్ఫ్యూలను మరింత పకడ్బందీగా నిర్వహించాలన్నారు. మంగళవారం ఆయన కరోనాపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన.. మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో మాట్లాడారు. ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అత్యవసర కార్యక్రమం దిల్లీ నుంచి వచ్చిన వారందరినీ పట్టుకొని వారికి వైద్య పరీక్షలు, చికిత్సలు చేయించడమేనని.. ఏ ఒక్కరూ మిగిలిపోరాదని కేసీఆర్ సూచించారు. వారికి నయం చేయడం, ఇతరులకు వ్యాపించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా యంత్రాంగాలు దీనిని అత్యంత ప్రాధాన్యాంశంగా భావించి పనిచేయాలని ఆదేశించారు. ప్రత్యేక బృందాలు పూర్తిస్థాయిలో పనిచేయాలని.. స్వచ్ఛందంగా వారు ముందుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ పేర్కొన్నారు.
అన్ని రకాల జాగ్రత్తలు
వ్యాధి వ్యాపించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో లాక్‌డౌన్, రాత్రిపూట కర్ఫ్యూకు ప్రజలు సహకరిస్తున్నారన్నారు. ఏప్రిల్ 14 వరకు ఇదే పరిస్థితి కొనసాగాలని సూచించారు. క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటు, తాత్కాలిక సిబ్బంది నియామకాలకు సన్నద్ధం కావాలని సీఎం ఆదేశించారు.
వలస కార్మికులకు ఆసరా