ఉద్యోగాల భర్తీ కోసం యువత చాలారోజులుగా ఎదురుచూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే ఉద్యోగ నియామకాలు చేపడతామని ఎప్పటి నుంచో చెబుతూ వస్తోంది. ఇందుకు సంబంధించి పలు దఫాలుగా కసరత్తు చేసింది. అయితే వివిధ కారణాల రీత్యా నియామక ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా వనపర్తి జిల్లాలో తెరాస బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్... నిరుద్యోగుల కోసం శాసనసభలో ప్రకటన చేస్తానని చెప్పారు. యువత ఎదురుచూస్తున్న ఉద్యోగ నియామకాలపై సీఎం ఇవాళ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయనున్నారు. దీంతో ఎన్ని ఉద్యోగాల నియామకాలు చేపడతారన్న విషయమై చర్చ ప్రారంభమైంది.
ఆ శాఖల్లో ఎక్కువ పోస్టులు..
శాఖల వారీగా ఖాళీల గుర్తింపు ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తయింది. గతంలో చేసిన కసరత్తు ప్రకారం వివిధ శాఖల్లో 70 వేలకు పైగా ఖాళీలు గుర్తించారు. పోలీసు, వైద్యారోగ్య, విద్యా శాఖల్లో ఎక్కువ పోస్టులు తేలాయి. అయితే అవకాశం ఉన్న అన్ని పోస్టులను గుర్తించే దిశగా సర్కార్ కసరత్తు చేసింది. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలకు సరిపడా పోస్టులు, కొత్త మండలాలు, అవసరమైన చోట పోస్టుల గుర్తింపు కోసం కసరత్తు చేశారు. పోస్టులకు సంబంధించి ఐఏఎస్ అధికారి శేషాద్రి నేతృత్వంలోని కమిటీ కసరత్తు చేసింది. అన్నింటి ఆధారంగా ఉద్యోగాల ఖాళీలను ప్రభుత్వం గుర్తించింది.
లక్ష ఉద్యోగాలు భర్తీ చేసే యోచనలో ప్రభుత్వం