రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేవరకు విశ్రమించబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర ఎనిమిదో అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనేక పోరాటాలు, త్యాగాలు బలిదానాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో దేశం గర్వించదగ్గ రీతిలో నిలబెట్టుకున్నామని సీఎం అన్నారు. ఏడేండ్ల అనతి కాలంలోనే ధృఢమైన పునాదులతో సుస్థిరతను చేకూర్చుకున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్న ఆయన... నాటి ఉద్యమ నినాదాలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని తెలిపారు. సాగు, తాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం, రోడ్లు, తదితర మౌలిక వసతులను స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలతో కల్పించు కుంటూ వస్తున్నామని వివరించారు.
అభివృద్ధి ద్వారానే ఘన నివాళి
భారత దేశంలో 29 రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ... అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికి, సహచర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే స్థాయిలో నిలబెట్టుకున్నందుకు తనకు గర్వంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సమైక్య రాష్ట్రంలో విస్మరించిన ఒక్కో రంగాన్ని దార్శనికతతో అవాంతరాలు లెక్కజేయకుండా సరిదిద్దుకుంటూ వస్తున్నామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని సీఎం తెలిపారు. ప్రజా ఆకాంక్షలను కార్యాచరణలో పెట్టాలనే చిత్తశుద్ది, ధృఢ సంకల్పం, తెలంగాణ పట్ల నిబద్ధత, అంతకు మించి... అమరుల త్యాగాలకు అభివృద్ధి ద్వారా ఘన నివాళి అర్పించాలనే స్పూర్తి సర్కారుకు ఉందని పేర్కొన్నారు.
అందరికీ అండగా ప్రభుత్వం