KCR Delhi Tour: గత ఎనిమిది రోజులుగా దిల్లీలో సీఎం కేసీఆర్ మకాం వేశారు. నేడు అధికారులతో పలు అంశాలపై కేసీఆర్ దిల్లీలో సమీక్షలు జరపనున్నారు. హైదరాబాద్ నగరం సొంతం చేసుకున్న వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్‌పై ముఖ్యమంత్రి రివ్యూ జరపనున్నారు. దీనిపై సమీక్షకు హాజరవాల్సిందిగా సీఎస్ సోమేశ్ కుమార్, స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖకు చెందిన రాజమౌళిని ఆదేశించారు. ఇందుకోసం వారంతా నిన్ననే దిల్లీకి చేరుకున్నారు.
ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డుపై తగినంత ప్రచారం జరగలేదన్న అసంతృప్తితో కేసీఆర్ ఉన్నారు. అవార్డుపై విస్తృతంగా ప్రచారం నిర్వహించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు మార్గనిర్దేశం చేయనున్నారు. వీటితో పాటు మరికొన్ని ఇతర ముఖ్యమైన అంశాలపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల కోసం యూపీ వెళ్లిన సీఎం... అక్కడి నుంచి హస్తిన చేరుకున్నారు. ఎనిమిది రోజులుగా అక్కడి ఉన్నారు. బీఆర్ఎస్ కోసం సిద్ధమవుతోన్న కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయంలో మార్పులపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. దిల్లీ సర్దార్ పటేల్ మార్గ్‌లో బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇందుకోసం జోద్‌పూర్ వంశీయుల బంగ్లాను కార్యాలయం కోసం లీజుకు తీసుకున్నారు.