తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్​ కీలక సమావేశం

కరోనా నియంత్రణ చర్యలు, ఉపాధి హామీ, వ్యవసాయం ప్రధాన ఎజెండాగా సీఎం కేసీఆర్​తో కలెక్టర్ల సమావేశం జరగనుంది. కలెక్టర్లతో పాటు జిల్లా పంచాయతీ అధికారులు కూడా సమావేశంలో పాల్గొననున్నారు. హరితహారం, పల్లె, పట్టణప్రగతి సహా ఇతర అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది.

By

Published : Jun 16, 2020, 3:15 AM IST

Updated : Jun 16, 2020, 6:48 AM IST

cm kcr will meet with collectors today in hyderabad
నేడు కలెక్టర్లతో సీఎం కేసీఆర్​ సమావేశం

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ప్రగతిభవన్​లో జరగనున్న ఈ భేటీలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. కలెక్టర్లతో పాటు జిల్లా పంచాయతీ అధికారులు సమావేశానికి హాజరవుతారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోన్న నేపథ్యంలో కట్టడి కోసం చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నారు.

రూ.750 కోట్లతో లక్ష కల్లాలు

ఉపాధి హామీ పనులకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉపాధి హామీ నిధులతో వీలైనన్ని ఎక్కువ శాఖల్లో పనులు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రూ.750 కోట్లతో లక్ష కల్లాలు నిర్మించేందుకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. వీటితోపాటు నీటిపారుదల శాఖలో కాల్వలు, డిస్ట్రీబ్యూటరీల పనులు, మరమ్మతులు ఉపాధి హామీ నిధులతో చేపట్టనున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ఉపాధి హామీ అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లు, అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

నియంత్రిత సాగుపై చర్చించే అవకాశం

ఈ వర్షాకాల సీజన్ నుంచే నియంత్రిత విధానంలో సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సంబంధిత అంశాలపై కూడా చర్చించనున్నారు. విత్తనాలు, ఎరువులు, రైతువేదికల నిర్మాణం, పంటల వివరాల నమోదు తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. పల్లె, పట్టణప్రగతి, హరితహారం, అర్బన్ పార్కుల అభివృద్ధి సహా ఇతర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఇవీ చూడండి:ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ.2,200: మంత్రి ఈటల

Last Updated : Jun 16, 2020, 6:48 AM IST

ABOUT THE AUTHOR

...view details