..
CM KCR: కొత్త సచివాలయ ప్రారంభ వేళ.. ఒప్పంద ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు
17:28 April 30
16:59 April 30
క్రమబద్ధీకరణ దస్త్రంపై మొదటి సంతకం చేసిన సీఎం కేసీఆర్
CM KCR Signature On Six Documents: కొత్త సచివాలయం ప్రారంభోత్సవం వేళ ఒప్పంద ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తూ దస్త్రంపైనే సీఎం కేసీఆర్ మొదటి సంతకం చేశారు. దీంతో మొత్తం 40 విభాగాల్లో 5,544 మంది ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం పట్ల సీఎం కేసీఆర్‌కు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం దగ్గర నుంచి ఉత్తర్వ ప్రతిని ఒప్పంద ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ కనక చంద్రంకు సచివాలయంలో మంత్రి అందించారు. ఈ విషయాన్ని హరీశ్‌రావు తన ట్విటర్లో పేర్కొన్నారు. ఒప్పంద ఉద్యోగుల తరఫున సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తెలంగాణ పర్యాటక ఒప్పంద ఉద్యోగులు ఆనందంతో సంబురాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
2,909 మంది జూనియర్ లెక్చరర్లు, 184 మంది జూనియర్ లెక్చరర్లు(ఒకేషనల్), 390 మంది పాలిటెక్నిక్, 270 మంది డిగ్రీ లెక్చరర్లు, సాంకేతిక విద్యాశాఖలో 131 మంది అటెండర్లు, వైద్య ఆరోగ్యశాఖలోని 837 మంది వైద్య సహాయకులు, 179 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 158 మంది ఫార్మాసిస్టులు, 230 మంది సహాయ శిక్షణ అధికారుల ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
దళితబంధుకు నిధుల విడుదల:కొత్త సచివాలయం ప్రారంభోత్సవం వేళ సీఎం కేసీఆర్ ఒప్పంద కార్మికుల క్రమబద్ధీకరణ ఫైల్‌తో పాటు మరో 5 దస్త్రాలపై సంతకాలు చేశారు. దళిత బంధు పథకం అమలు ఫైల్‌పై సీఎం సంతకం చేశారు. 118 నియోజకవర్గాల్లో 1100 మందికి చొప్పున దళిత బంధు వర్తించనుంది. అలాగే పోడు భూముల పట్టాల పంపిణీ దస్త్రంపై కూడా సంతకం చేశారు. మే నుంచి జిల్లాల వారీగా పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ పోడు పట్టాలు ద్వారా 1,35,000 మందికి లబ్ధి కలుగనుంది. పోడు పట్టాల పంపిణీ ద్వారా 3.9 లక్షల ఎకరాల పోడు భూములను పంపిణీ చేయనున్నారు. మరొక దస్త్రమైన సీఎంఆర్ఎఫ్ నిధులు అందించే దస్త్రంపై కూడా కేసీఆర్ సంతకం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా న్యూట్రిషన్ కిట్ల పంపిణీ: రాష్ట్రవ్యాప్తంగా గర్భిణీలకు పౌష్టికాహారం అందించే న్యూట్రిషన్ కిట్ దస్త్రంపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. అందుకు తగిన ఆదేశాలను జారీ చేశారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6.84 లక్షల మంది గర్భిణీలకు.. 13.08 లక్షల కిట్స్ పంపిణీ చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఒక్కో న్యూట్రిషన్ కిట్ విలువ రూ. 2000లుగా నిర్ధారించారు. ఈ పథకానికి మొత్తం రూ. 277 కోట్లు ఖర్చు చేయనున్నారు. అందుకు సీఎం కేసీఆర్‌కు మంత్రి హరీశ్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
పాలమూరు ఎత్తిపోతలపై రేపు సమీక్ష: ఇంకొక సాగునీటి ప్రాజెక్టు అయిన పాలమూరు ఎత్తిపోతలకు సంబంధించిన పేపర్లపై కూడా సీఎం సంతకం చేశారు. దీని గురించి రేపు మధ్యాహ్నం కొత్త సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. కరివేన, ఉద్దండాపూర్ నుంచి వెళ్లే కాల్వల గురించి చర్చించనున్నారు. నారాయణ్‌పూర్, కొడంగల్, వికారాబాద్ వెళ్లే కాల్వల గురించి కూడా చర్చిస్తారు. ఈ సమీక్షలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
ఇవీ చదవండి: