తెలంగాణ

telangana

ETV Bharat / state

KCR 24 HOURS DEADLINE: కేంద్రానికి కేసీఆర్ 24 గంటల డెడ్​లైన్

KCR 24 HOURS DEADLINE: దిల్లీ తెలంగాణ భవన్​ వద్ద చేపట్టిన తెరాస నిరసన దీక్షలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో భాజపా నేతలను విమర్శించారు. రాష్ట్ర భాజపా నేతలు తనను జైలుకు పంపుతామని అంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రిని జైల్లో వేస్తామంటారా? దమ్ముంటే రండి.. అంటూ సవాల్​ విసిరారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో 24 గంటల్లో కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

CM KCR WARNING TO BJP LEADERS IN DELHI
ముఖ్యమంత్రిని జైల్లో వేస్తామంటారా? దమ్ముంటే రండి: కేసీఆర్‌

By

Published : Apr 11, 2022, 2:00 PM IST

Updated : Apr 12, 2022, 4:43 AM IST

ముఖ్యమంత్రిని జైల్లో వేస్తామంటారా? దమ్ముంటే రండి: కేసీఆర్‌

భాజపా నేతలు అడ్డగోలుగా వ్యవహరించారు. పంట మార్పిడి చేయాలని గోయల్‌ సూచించారు. మా మంత్రులు, ఎమ్మెల్యేలు, సర్పంచులు రైతుల వద్దకెళ్లి చెప్పారు. మరోపక్క కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు వరి వేయండి.. పంట మేం కొంటాం...ముఖ్యమంత్రి మాటలు పట్టించుకోనవసరం లేదన్నారు.(ఈ సమయంలో ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ వీడియోలను ప్రదర్శించారు). ప్రతి గింజా కొంటామన్న కిషన్‌రెడ్డి ఇప్పుడు ఎటు పోయారో తెలియదు. మా ప్రజాప్రతినిధులంతా దిల్లీలో దీక్ష చేయడానికి వస్తే భాజపా వాళ్లు హైదరాబాద్‌లో దీక్ష పెట్టారు. మా హక్కుల కోసం మేం హస్తినలో ఉద్యమిస్తే అక్కడ దీక్ష చేయడానికి వారికి సిగ్గుండాలి.

మా రైతులను గంగలో పడేయడం నేను బతికుండగా జరగదు. రక్షించుకుంటాం. అయితే దేశవ్యాప్తంగా భాజపా తీరు ఎలా ఉందో తెలియజేస్తాం. నేను ఈ రోజో రేపో వెళతా. సమస్యకు సమాధానం కనిపెడతా... పరిష్కరిస్తా. మళ్లీ దిల్లీ వస్తా. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేస్తా. రైతులకు రాజ్యాంగపరమైన రక్షణ లభించే వరకు.. కనీస మద్దతు ధర చట్టరూపంలో వచ్చే వరకు పోరాడతాం. సాధ్యమైనంత త్వరగా కలిసొచ్చే సీఎంలు, పార్టీల సమ్మతితో దేశంలో భగభగ మండే భూకంపం సృష్టిస్తాం’’

సాగు చట్టాల విషయంలో దేశ రైతులకు ప్రధాని స్వయంగా క్షమాపణ అడగాల్సి వచ్చింది. మన ప్రధాని క్షమాపణలతోనూ వ్యాపారం చేయగలిగిన వ్యక్తి. ఎన్నికలు వచ్చినప్పుడు క్షమాపణ చెబుతారు. ఈ దేశ రైతులు బిచ్చగాళ్లు కాదు.. తమ హక్కును డిమాండ్‌ చేస్తున్నారు. నూతన వ్యవసాయ విధానానికి రూపకల్పన చేయాలని ప్రధానిని కోరుతున్నా. మీతో ఆ పని కాకపోతే మిమ్మల్ని పక్కకు తప్పించి.. వచ్చే నూతన ప్రభుత్వంతో దేశమంతటికీ వర్తించే సమగ్ర నూతన వ్యవసాయ విధానం వచ్చేలా చూస్తాం’’

ప్రతిపక్ష పార్టీల నేతలెవరైనా వారికి వ్యతిరేకంగా మాట్లాడితే సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలు వారి వెంటపడతాయి. వారి పార్టీలో అంతా సత్యహరిశ్చంద్రులా? ఆయన సోదరులా? భాజపాలో ఒక్క నేతపైకి సీబీఐ, ఈడీ వెళ్లవు. ప్రజాహిత సీఎంలను జైలుకు పంపుతామని ప్రతి రాష్ట్రంలో తమాషా చేస్తున్నారు. ఎవరిని జైలుకు పంపుతారు. దమ్ముంటే రండి. వీరి(భాజపా) చిన్నచితకా నేతలు సీఎంని జైలుకు పంపుతామని మొరుగుతున్నారు. నేను మౌనంగా కూర్చోను. తెలంగాణలో చేయాల్సింది చేశా. ఇక ముందు దేశం కోసం చేస్తా. అందుకోసం మేం బయలుదేరాం’’- సీఎం కేసీఆర్‌

‘తెలంగాణ రైతుల తరఫున నరేంద్ర మోదీ, పీయూష్‌ గోయల్‌కు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. మా రాష్ట్రం సహా అన్ని చోట్లా ధాన్యం కొనుగోలు చేయండి. మీ నుంచి ఆదేశాల కోసం 24 గంటలు ఎదురు చూస్తాం. ఆ తర్వాత ఏం చేయాలో మాకు తెలుసు. మా నిర్ణయం తీసుకుంటాం. మీ వెంట మాత్రం పడతాం. అప్పుడు ఏమవుతుందో చూడండి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరించారు. యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ‘రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష’ పేరుతో దిల్లీ తెలంగాణభవన్‌లో సోమవారం నిర్వహించిన దీక్షలో ఆయన ప్రసంగించారు. 30 నిమిషాలు మాట్లాడిన ముఖ్యమంత్రి తెలంగాణ చరిత్ర.. రైతుల కష్టాలు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దిగుబడి పెంపునకు కారణాలు.. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ వ్యవహరించిన తీరు.. రాష్ట్ర భాజపా నేతల తీరును ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మోదీపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి ప్రసంగం ఆద్యంతం హిందీలో సాగింది.‘‘దేశానికి అన్నంపెట్టే రైతులను నూకలు తినమనే అహంకారం మీకెక్కడి నుంచి వచ్చింది.. రైతులను సొంత పొలాల్లోనే జీతగాళ్లను చేయాలనుకుంటున్నారు..రాజకీయం వేరు. రైతుల విషయం వేరు. ఇప్పుడు నేను రైతుల విషయమే మాట్లాడుతున్నా. నేను మరోసారి దిల్లీ వచ్చాక మిగతా విషయాలు చెబుతా. రాష్ట్రపతి ఎన్నిక తర్వాతో.. ముందో వచ్చి మా మిత్రులతో కలిసి మాట్లాడతా. మనకు విజయం రావచ్చు. రాకపోవచ్చు. తెలంగాణ రైతుల డిమాండ్‌ కోసం వచ్చాం. ధాన్యం కొనాలని ప్రధాని నుంచి ఆదేశం వస్తే మంచిది. రాకపోయినా మంచిదే. మనం పేదోళ్లం కాదు. మన చేతుల్లో సమస్యకు సమాధానం ఉంది. రేపు, ఎల్లుండిలోగా దీనిపై నిర్ణయం తీసుకుంటాం. ఆ తర్వాత దేశంలోని రైతుల కోసం పోరాడతాం.

రైతు కంటి నుంచి నీరొస్తే ప్రభుత్వం పడిపోతుంది

దాదాపు 2వేల కిలోమీటర్ల దూరంలోని తెలంగాణ నుంచి ఇంత ఎండలో మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, రైతులు రావడానికి కారణమేమిటో మోదీ తెలుసుకోవాలి. కష్టపడే రైతు కంటి నుంచి నీరొస్తే ప్రభుత్వం పడిపోతుంది. మా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో పాటు కొందరు మంత్రులు తెలంగాణ రైతుల డిమాండ్లను విన్నవించేందుకు దిల్లీ వస్తే వారితో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ వ్యవహరించిన తీరు దారుణంగా, అవమానకరంగా ఉంది. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను నూకలు తినమన్నారు. ఆయన పీయూష్‌ గోయల్‌ కాదు.. పీయూష్‌ గోల్‌మాల్‌. వారికేమైనా వెయ్యేళ్లు పాలించడానికి అవకాశమిచ్చారా? మంత్రులు వచ్చినప్పుడు మూడేసి గంటలు కూర్చోబెట్టి వెళతారా? తిరిగి మాపైనే నిందలు మోపుతారా? ఇదేనా ఆయన నీతి? కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే తీరు ఇదేనా? ఇది సరికాదు. దేశ ప్రజల గుండెల్లో మంట మండుతోంది. ఆ మంట మా గుండెల్లోనూ ఉంది. అది మిమ్మల్ని ఖతం చేసేవరకు పోదు. అప్పుడు పీయూష్‌ గోల్‌మాల్‌ పారిపోవడం ఖాయం. హిట్లర్‌, ముస్సోలిని, నెపోలియన్‌ వంటి వారే పోయారు. ఈయన ఎంత?

నాడు దుఃఖ భరితం.. ఇప్పుడు అద్భుతం

దేశ చరిత్రపై పీయూష్‌ గోయల్‌కు ఏం పరిజ్ఞానం ఉందో నాకు తెలియదు. మా తెలంగాణ కథ వేరే ఉంది. మేం ప్రత్యేక రాష్ట్రంగా ఉండేవాళ్లం. దిల్లీ మమ్మల్ని బలవంతంగా ఆంధ్రప్రదేశ్‌లో కలిపింది. ఆ తర్వాత మేం అనేక బాధలు పడ్డాం. మా ప్రాంతంలో కట్టాల్సిన ప్రాజెక్టులు కట్టలేదు. ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో 30 లక్షల బోర్లు ఉన్నాయి. వాటి కరెంటు, మోటార్లకు మా రైతులు రూ.25వేల కోట్లు ఖర్చుపెట్టారు. అదీ మా వ్యథాభరిత కథ. కాకతీయ రాజులు ఏర్పాటు చేసిన చిన్న నీటిపారుదల వ్యవస్థ ఏపీ ప్రభుత్వ చిన్నచూపుతో ధ్వంసమైంది. ఫలితంగా వెయ్యి అడుగుల లోతుకి భూగర్భజలం పడిపోయింది. కరెంటు అయిదారు గంటలు మించి ఉండేది కాదు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 35 లక్షల మంది ఉంటే 20 లక్షల మంది పొట్ట చేతపట్టుకొని వలసపోయారు. తెలంగాణ ప్రజలు 1956 నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. 1969 ఉద్యమంలో 400 మంది యువత పోలీస్‌ తూటాలకు బలయ్యారు. 2001లో తెలంగాణ నినాదంతో గులాబీ జెండా ఎత్తుకున్నా. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించా. 2014, జూన్‌ 2న మా రాష్ట్రం ఏర్పడింది. తెరాసకు ప్రజలు అవకాశమివ్వడంతో మేం రైతులకు తొలి ప్రాధాన్యం ఇచ్చాం. 46 వేల చెరువులను మిషన్‌ కాకతీయ పేరుతో పునరుద్ధరించాం. కరెంటు కష్టాలు అధిగమించాం. ఇప్పుడు దేశం మొత్తంమీద 24 గంటలపాటు నాణ్యమైన కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. మరోవైపు దేశంలో కరెంటు కోసం పోరాటాలు చూస్తున్నాం. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ రైతులు రోడ్లపై పడ్డారు. ఇప్పుడు మా చెరువులు నిండాయి. 30 లక్షల బోర్లు నడుస్తూ పంట దిగుబడి పెరిగితే పీయూష్‌ గోల్‌మాల్‌ తెలంగాణలో ఏం అద్భుతం జరిగిందంటున్నారు. మీకు అర్థం కాకపోతే మేమేం చేస్తాం. మా పార్లమెంట్‌ నేత కేశవరావు ఓ ప్రశ్న అడిగితే మీకు అర్థం కావడం లేదని మీరంటున్నారు. అర్థం కానిది కేశవరావుకు కాదు.. మీకు. 2014- 2022 మధ్యకాలంలో తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరిచ్చాం.

అన్నం పెట్టే రైతులను దోషులుగా నిలబెడతారా?

నీతి, నిజాయతీలతో ప్రజలను ప్రేమించే ప్రధాని అయితే తెలంగాణ రైతుల కష్టాన్ని ప్రశంసించేవారు. అందుకు విరుద్ధంగా అవమానించేవారా? అన్నం పెట్టే రైతులను దోషులుగా నిలబెడతారా? ఇంత పెద్ద కేంద్ర ప్రభుత్వం, పెద్ద పెద్ద మాటలు చెప్పే ప్రధాని వద్ద చిన్న తెలంగాణలో రైతులు పండించిన పంట కొనుగోలు చేసే ధనం లేదా? మోదీకి మనసు లేదా? మీకు తెలంగాణ ఓట్లు కావాలి.. సీట్లు కావాలి.. కానీ ధాన్యం వద్దు. దేశంలోని రైతు భూములన్నీ కార్పొరేట్లపరం చేసి వాళ్ల భూముల్లో వాళ్లనే జీతగాళ్లు చేయాలనేది కేంద్ర విధానం.

టికాయిత్‌పై ప్రశంసల జల్లు..

రాకేశ్‌ టికాయిత్‌ తండ్రి మహేంద్ర టికాయిత్‌ గొప్ప రైతు నేత. 1978-80ల్లో ఆయన ఒక్క పిలుపు ఇస్తే లక్షలాది మంది రైతులు కదిలేవారు. ఈ రోజు ఉపవాసమైనా రాకేశ్‌ టికాయిత్‌ మన కోసం దీక్షకు వచ్చారు. దేశంలో రైతు మహా సంగ్రామం ప్రారంభవుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజలు, రైతులు ఆయనకు అండగా నిలుస్తారు. కేంద్రం ఆయనను ఎన్నో ఇబ్బందులు పెట్టింది. అయినా ఎంతో దృఢంగా నిలిచారు. రైతుల డిమాండ్ల కోసం 13 నెలలుగా పోరాడటం ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేదు’ అని కేసీఆర్‌ ప్రసంగించారు.

ఇదీ చదవండి :CM KCR Comments on Piyush Goyal: 'పీయూష్‌ గోయల్‌ కాదు.. పీయూష్‌ గోల్‌మాల్‌'

Last Updated : Apr 12, 2022, 4:43 AM IST

ABOUT THE AUTHOR

...view details