CM KCR Visited Hailstorm Rain Affeted Districts: వడగళ్లు, ఈదురు గాలులు, భారీ వర్షాలకు పంట నష్టపోయిన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృతంగా పర్యటించారు. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల పర్యటనలో భాగంగా తొలుత ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్ మండలంలోని రావినూతల, గార్లపాడు గ్రామాలు సందర్శించారు. నష్టపోయిన పంటలను పరిశీలించి జరిగిన నష్టంపై రైతులతో ఆరా తీశారు. ఉన్నతాధికారులు, మంత్రులు, సీపీఐ, సీపీఎం కార్యదర్శులు పాల్గొన్నారు.
తీవ్రంగా దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించి.. నష్టపోయిన రైతులతో సీఎం మాట్లాడారు. పంటనష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరుగాలం శ్రమించి మొక్కజొన్న సాగుచేస్తే... తీరా చేతికొచ్చే సమయానికి ప్రకృతి విపత్తుతో అంతా తుడిచిపెట్టుకుపోయిందని కర్షకులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పంటలు నష్టపోయిన రైతుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.
కేంద్రం ఎటువంటి సహాయం చేయడం లేదు: కేంద్రం రైతులకు ఎలాంటి సాయం చేయడం లేదని.. అందుకే ఈసారి నివేదిక పంపబోమని ఆయన స్పష్టంచేశారు. ఖమ్మం జిల్లా పర్యటన అనంతరం మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్దవంగర మండలం రెడ్డికుంటతండాలో దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. మొక్కజొన్న, మిర్చి పంటలు, మామిడి తోటలను చూశారు. రైతులతో మాట్లాడి వారిని ఓదార్చి.. ధైర్యాన్ని నింపారు.